జగన్ షర్మిల మధ్య సయోధ్యకు యత్నాలు ?
ఇద్దరిదీ ఒకే రక్తం. ఇద్దరిదీ ఒకే పట్టుదల. పెద్దాయన వైఎస్సార్ వారసత్వం కోసం ఇద్దరూ పోటీ పడుతున్న నేపధ్యం ఉంది.
ఇద్దరిదీ ఒకే రక్తం. ఇద్దరిదీ ఒకే పట్టుదల. పెద్దాయన వైఎస్సార్ వారసత్వం కోసం ఇద్దరూ పోటీ పడుతున్న నేపధ్యం ఉంది. వైఎస్సార్ మరణానంతరం ఒకే కుటుంబంగా ఉంటూ 2019లో వైసీపీని అధికారంలోకి తీసుకుని వచ్చేంతవరకూ కూడా అన్నా చెల్లెలు కలసి పనిచేసారు. ఆ తరువాతనే విభేదాలు మొదలయ్యాయని అంటారు.
అంతే రాజకీయ దారులూ వేరు అయ్యాయి. మొదట తెలంగాణాలో రాజకీయ పార్టీని పెట్టి దానికి కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీలో పీసీసీ చీఫ్ గా వచ్చిన వైఎస్ షర్మిల వైసీపీకి ఎంత నష్టం చేయాలో అంతా చేశారు. టీడీపీ కూటమి గెలుపు వెనక సవాలక్ష కారణాలు ఉంటే అందులో షర్మిల జగన్ కి ఎదురు నిలిచి కాంగ్రెస్ తరఫున గట్టిగా ప్రచారం చేయడం మరో కారణం. వైసీపీ ఓటమికి కూటమి కారణం అయితే విపక్ష స్థానం కూడా దక్కకుండా ఘోరంగా ఒటమి పాలు కావడానికి మాత్రం షర్మిల కారణం అని విశ్లేషిస్తారు.
చాలా సీట్లు తక్కువ మెజారిటీతో వైసీపీ కోల్పోయింది. ముఖ్యంగా రాయలసీమలో భారీ ఎత్తున దెబ్బ పడింది అంటే కాంగ్రెస్ కి షర్మిల సారధ్యం వహించడమే కారణం అని అంటున్నారు. ఇదిలా ఉండగా వైసీపీ ఓటమి తరువాత ఎన్డీయేలో టీడీపీ జనసేన కలసి ఉన్న తరువాత ఇక ఆల్టర్నేషన్ గా ఇండియా కూటమి వైపు చూస్తోంది అన్న వార్తలు అయితే ప్రచారంలో ఉన్నాయి.
ఇక ఇండియా కూటమికి కాంగ్రెస్ పెద్దన్న అన్నది తెలిసిందే. కాంగ్రెస్ అంగీకారం ఉంటేనే తప్ప వైసీపీ ఇండియా కూటమిలోకి రాలేదు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పెద్దలు అనదగిన వారు ఏపీ రాజకీయాల మీద ఫోకస్ పెడుతున్నారు అని అంటున్నారు. వైఎస్ జగన్ ని తమ వైపు తిప్పుకుంటూనే ఏపీలో వైసీపీ కాంగ్రెస్ ఒకే గూటిలో ఒదగాలంటే రెండు పార్టీల అధినేతలు అయిన షర్మిల జగన్ ల మధ్య సయోధ్య ఉండాలని కూడా కోరుకుంటున్నారుట.
ఇందుకోసం ట్రబుల్ షూటర్ గా కాంగ్రెస్ లో పేరుపడిన ఒక పెద్దాయన ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అలా జరిగితేనే ఏపీలో కాంగ్రెస్ కి లాభం అన్నది ఆయన భావన. ప్రస్తుతానికి ఇది పుకారుగా సాగుతున్న విషయమని చెబుతున్నారు. అయితే జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకత షర్మిల చూపిస్తున్నారు.
అది వ్యక్తిగత స్థాయిలోనే ఉంది. అలాగే తన ఓటమికి సొంత కుటుంబ సభ్యులు కారణం అయ్యారు అన్న బాధ అగ్రహం జగన్ లో ఉంది అని అంటున్నారు. మిగిలినవి ఎలా ఉన్నా షర్మిల విషయంలో జగన్ రాజీ ధోరణికి వస్తారా అన్నది కూడా చర్చగానే ఉంది.
అయితే రాజకీయం అవసరం ఈ ఇద్దరికీ ఉంది. వెనక ఉన్న ట్రబుల్ షూటర్ ఇలాంటి వ్యూహాలలో ఆరి తేరి ఉన్నారు. పైగా రాజకీయాలో ఏమైనా జరగవచ్చు అన్న మాట కూడా ఉంది. అలా కనుక ఆలోచిస్తే ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్లుగా ఈ ఇద్దరి మధ్యన సయోధ్య కుదరవచ్చు అని అంటున్నారు.
అయితే ఇవన్నీ పుకారులుగానే షికారు చేస్తున్నాయి. వీటిలో ఎంత నిజం ఉందో కూడా తెలియదు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.