కాంగ్రెస్ కీలక సమావేశం
మొత్తం 17 నియోజకవర్గాల్లో పోటీచేయటం కోసం 306 దరఖాస్తులు అందాయి. అంటే నియోజకవర్గానికి సగటున 18 మంది నేతలు దరఖాస్తులు చేసుకున్నారు.
గాంధిభవన్లో కాంగ్రెస్ కమిటి ఆధ్వర్యంలో కీలకమైన సమావేశం జరగబోతోంది. రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధుల ఎంపికపై మొదటి సమావేశం జరగబోతోంది. ఈమధ్యనే ఎంపీలుగా పోటీచేయటానికి ఆసక్తి ఉన్న నేతల నుండి పార్టీ దరఖాస్తులు తీసుకున్న విషయం తెలిసిందే. మొత్తం 17 నియోజకవర్గాల్లో పోటీచేయటం కోసం 306 దరఖాస్తులు అందాయి. అంటే నియోజకవర్గానికి సగటున 18 మంది నేతలు దరఖాస్తులు చేసుకున్నారు. వీటిలో ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ నియోజకవర్గాలకు బాగా పోటీ ఉన్నట్లు సమాచారం.
టికెట్ కోసం నేతలుచేసుకున్న దరఖాస్తులపై ఈరోజు గాంధిభవన్లో జరిగే ప్రదేశ్ ఎలక్షన్ కమిటి(పీఈసీ) మీటింగులో చర్చ జరుగుతుంది. 39 మంది సభ్యుల కమిటికి ఐఏసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణా ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఐఏసీసీ స్క్రీనింగ్ కమిటి ఛైర్మన్ హరీష్ చౌదరి, సభ్యులు జిగ్నేష్ మేవాని, విశ్వజిత్ కదమ్ తదితరులు హాజరుకాబోతున్నారు. వీరి సమక్షంలోనే దరఖాస్తులపై డీటైల్డ్ గా చర్చజరిగిన వడబోత మొదలవుతుంది. ఢిల్లీలో ఉన్న కారణంగా రేవంత్ రెడ్డి ఈ మీటింగుకు హాజరకావటంలేదు. అయితే మంత్రులు హాజరవుతారు.
దరఖాస్తులు చేసుకున్న నేతల నేపధ్యం, ట్రాక్ రికార్డు, పార్టీకి చేసిన సేవలు, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నపుడు పదేళ్ళలో చేసిన పోరాటాలు, పబ్లిక్ లో ఇమేజి, విజయవకాశాలు, గెలుపు అవకాశాలు తదితరాలన్నింటిపైనా చర్చించబోతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా అభ్యర్ధుల వడబోతపై ఇదే విధంగా ఒకటికి పదిసార్లు కమిటి చర్చించిన విషయం తెలిసిందే. మూడునాలుగు రకాలుగా చర్చలు జరిగి, వడబోతలు జరిగి చివరకు ఢిల్లీ స్ధాయిలో సమావేశాలు, సమీక్షలు జరిగిన తర్వాత టికెట్లను ఫైనల్ చేశారు.
ఇపుడు పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేయబోయే అభ్యర్ధుల ఎంపిక ప్రొసీజర్ కూడా ఇదే ఉంటుందనటంలో సందేహంలేదు. పీఈసీ స్ధాయిలో మొదటి దరఖాస్తులను ఫిల్డర్ చేస్తే తర్వాత స్క్రీనింగ్ కమిటి ఆ తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటి ఆమోదిస్తుంది. అప్పుడు ఐఏసీసీ ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడి స్ధాయిలో టికెట్లను ఫైనల్ చేస్తారు. ఇవన్నీ పార్టీలో ఎప్పుడూ ఉండే తంతే అని అందరికీ తెలిసిందే. కాకపోతే నామినేషన్ వేస్తే గెలుపు గ్యారెంటీ అనే నమ్మకం పెరిగిపోవటంతో టికెట్ల కోసం పోటీ బాగా పెరిగిపోయిందంతే.