కాంగ్రెస్‌కు మోడీ అర్ధం కాలేదా?
దేశంలో సుదీర్ఘ చరిత్రను సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి.. రాజకీయాల గురించి ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు.
దేశంలో సుదీర్ఘ చరిత్రను సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి.. రాజకీయాల గురించి ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. కాలమో ఖర్మమో తెలియదు కానీ.. 132 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ.. కుంజర యూదంభు దోమ కుత్తుక జొచ్చినట్టు.. మోడీ చేతిలో చిక్కి విలవిల్లాడుతోంది. 2014లో కేంద్రంలో పాగా వేసిన నరేంద్రమోడీ.. అప్పటి నుంచి కాంగ్రెస్కు చుక్కలు చూపిస్తున్నారు. ఇంతింతై అన్నట్టుగా ఆయన పుంజుకుంటున్న తీరు కాంగ్రెస్‌కు ఊపిరి ఆడకుండా చేస్తోంది.
కాంగ్రెస్ ఒక ఎత్తు వేస్తే.. మోడీ వెంటనే పై ఎత్తు వేస్తున్నారు. దీంతో ఎత్తులు చిత్తయి.. కాంగ్రెస్ విలవిల లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇండియా కూటమితో మోడీకి చెక్ చెప్పాలని భావించినకాంగ్రెస్‌కు.. తీరా ఎన్నికలకు ముందు.. సెగలు పొగలు కాదు.. ఏకంగా భోగిమంటలే ఎదురవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ప్రాంతీయ పార్టీలను కూడగట్టి.. మోడీకి వ్యతిరేకంగా చక్రంతిప్పేందుకు సిద్ధమైన కాంగ్రెస్‌కు కూటమిలోని ప్రధాన పక్షాలు దూరమవుతున్నాయి.
ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భారీ షాక్ ఇచ్చేసింది. తమ రాష్ట్రంలోని 47 పార్లమెంటు స్థానాల్లోనూ తామే ఒంటరిగా బరిలో దిగుతామని ఆమె చెప్పేశారు. మరోవైపు.. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీపార్టీ కూడా రాం రాం చెప్పేసింది. పంజాబ్‌లో తాము ఒంటరిగానే బరిలో నిలుస్తామని వెల్లడించింది. ఇక్కడ 13 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. మొత్తంగా ఒంటరి పోరు కు రెడీ అయ్యారు. ఇక, ఇప్పుడు మరో కీలక రాష్ట్రం బిహార్‌లోనూ కూటమి నాయకుడు, సీఎం నితీష్ కుమార్ ఒంటరిపోరుకు రెడీ అయ్యారు.
పీఎం పోస్టుపై ఆశలు పెట్టుకున్న నితీష్‌కు కాంగ్రెస్ నుంచి ఆ తరహా హామీ లభించలేదు. దీంతో ఆయన కూడా ఒంటరి పోరుకు రెడీ అయ్యారు. దీంతో కీలక పార్టీలన్నీ.. ఒక్కొక్కటిగా కాంగ్రెస్ పార్టీకి దూరమవుతు న్నాయి. ఇది నాణేనికి ఒకవైపు..కానీ, మరోవైపు చూస్తే.. కేంద్రంలోని నరేంద్ర మోడీ వ్యూహం స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇండియా కూటమిని బలోపేతం కాకుండా చేయడం ఒకటి.. రెండో రాహుల్ గాంధీనిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ యాత్రను నిలువరించడం.. ఈ రెండు విషయాల్లోనూ ఆయన వేస్తున్న పాచికలు.. (ఈడీ, సీబీఐ సహా ఇతర దారుల్లో) కాంగ్రెస్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో మోడీ వ్యూహాలు ఆ పార్టీకి అంతుచిక్కడం లేదనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్మం.