లోక్ సభ సర్వే చూస్తే.. తెలంగాణలో కాంగ్రెస్ కే అధికారం ?

ఇండియా కూటమిలో ప్రధాన పార్టీ కాగ్రెస్ . కాంగ్రెస్ కు లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో కేవలం 2% ఓట్లే వస్తాయని సీ ఓటర్ సర్వే తెలిపింది

Update: 2023-08-28 08:13 GMT

తెలంగాణలో మరొక్క మూడు నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న వేళ.. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ 95 శాతం అభ్యర్థులను ప్రకటించేసింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. బీజేపీ కూడా త్వరలో జాబితా విడుదల చేసే ప్రయత్నాల్లో ఉంది. అయితే, ఇప్పటివరకు పెద్దగా చర్చల్లోకి రాని అంశం.. ఓటరు మొగ్గు ఎటువైపు ఉన్నదనేదే?

వాస్తవానికి లోక్ సభ ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉంది. వీటికి ముందుగా తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ వంటి పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీకి ఎన్నికలున్నాయి. వీటిలో రాజస్థాన్ ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్ లో రెండేళ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చిన బీజేపీ అధికారం చేపట్టింది. మిగిలింది తెలంగాణ.. ఇక్కడ రెండు దఫాలుగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గెలుస్తూ వస్తోంది. వరుసగా మూడోసారి కూడా గెలుపు తమదే అని అంటోంది.

లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సెమీఫైనల్స్ గా భావిస్తున్నారు. ఇక్కడ నెగ్గితే.. లోక్ సభ ఎన్నికలకు ధీమాగా వెళ్లవచ్చు. మెజార్టీ రాష్ట్రాల్లో నెగ్గితే.. బీజేపీ ఆ ఫలితాన్ని ప్రధాని మోదీ పాలనకు దక్కిన ప్రతిఫలంగా చెప్పుకొంటుంది. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర, మోదీ పాలనపై ఉన్న వ్యతిరేకతకు ఈ ఫలితాలు ప్రతిబింబమని ప్రచారం చేసుకుంటుంది.

తెలంగాణలోనే పోరు భిన్నం

రాజస్థాన్, మధ్యప్రదేశ్; ఛత్తీస్ గఢ్ ఈ మూడు చోట్ల పోటీ కాంగ్రెస్ -బీజేపీ మధ్యనే ఉంది. తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నెలకొంది. పైకి హడావుడి చేస్తున్నా.. బీజేపీకి మూడో స్థానం మాత్రమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, కొన్ని సీట్లలో మాత్రం త్రిముఖ పోరు తప్పదు. అలాంటిచోట గెలుపెవరిది అనేది పరిస్థితులను బట్టి బేరీజు వేయాల్సి ఉంటుంది.

సర్వేలో ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా..

లోక్‌ సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీదే పై చేయి అని ఇటీవల ఇండియా టుడే-సీ వోటర్ సర్వే తెలిపిం. అయితే, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య నే హోరాహోరీ పోరు సాగుతుందని తే ల్చింది. చివరకు కాంగ్రెస్ కే మొగ్గు ఉంటుందని పేర్కొంది. కాగా, తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ కు 7, బీఆర్ఎస్ కు 5, బీజేపీకి 4 సీట్లు దక్కుతాయని వివరించింది. ఎంఐఎం ఎప్పటిలాగే హైదరాబాద్ సీటును నిలుపుకొంటుందని స్పష్టం చేసింది.

ఓట్ల శాతం ఇలా...

ఇండియా కూటమిలో ప్రధాన పార్టీ కాగ్రెస్ . కాంగ్రెస్ కు లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో కేవలం 2% ఓట్లే వస్తాయని సీ ఓటర్ సర్వే తెలిపింది. కానీ, తెలంగాణలో 38% ఓట్లు లభిస్తాయని సర్వేలో వెల్లడైంది. తెలంగాణ అధికార పార్టీ బీఆర్‌ఎస్ కు కాంగ్రెస్ కంటే 6 శాతం తక్కువగా 32% ఓట్లు.. 5 సీట్లు మాత్రమే వస్తాయని సీ ఓటర్ సర్వే తెలిసింది.

బీఆర్ఎస్ కు తగ్గి కాంగ్రెస్, బీజేపీలకు లబ్ధి

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీని తక్కువ అంచనా వేయక్కర్లేదని.. ఆ పార్టీకి 23% ఓట్లతో 4 సీట్లు లభిస్తాయని సర్వేలో వెల్లడైంది. కాగా, 2019ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 41.71% ఓట్లు వచ్చాయి. 2024 నాటికి ఈ ఓట్లు దాదాపు 10% తగ్గనున్నట్లు సీ ఓటర్ సర్వే చెబుతోంది. కానీ కాంగ్రెస్ ఓట్లు 29.79% నుంచి 38శాతానికి పెరగుతాయని స్పష్టం చేసింది. బీజేపీకి 2019లో 19.65% ఓట్లు రాగా.. ఈసారి 4% మేర పెరుగుతాయని లెక్కేసింది. అంటే.. బీఆర్‌ఎస్‌ తప్ప బీజేపీ, కాంగ్రెస్ ఓట్ల శాతం పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.

కాంగ్రెస్ పెద్ద పార్టీ..

సీ ఓటర్ సర్వే ప్రకారం కాంగ్రెస్ కు 7 లోక్ సభ స్థానాలు దక్కుతాయి. ఒక్కో పార్లమెంటు సీటులో ఏడు శాసన సభ స్థానాలుంటాయి. ఈ లెక్కన శాసన సభ స్థానాలను తీసుకుంటే కాంగ్రెస్ కు అసెంబ్లీ ఎన్నికల్లో 49 సీట్లు వస్తాయని భావించవచ్చు. బీఆర్ఎస్ 35, బీజేపీ 20 సీట్లు గెలుస్తాయని అంచనా కట్టొచ్చు. అంటే తెలంగాణలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఆవిర్భవించనుంది. మొత్తానికి వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు ఈ ఎన్నికలు క్లిష్టమైనవిగా మారుతున్నాయని, ప్రజాబలం తగ్గుతున్నదనడానికి సంకేతాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలకు 8 నెలల సమయం ఉంది. ఎన్నికలు మొదలయ్యాక పరిస్థితిలో మార్పు వచ్చి బీఆర్‌ఎస్‌ ఓట్ల శాతం మరింత తగ్గి, కాంగ్రెస్‌ పుంజుకునే అవకాశాలు లేకపోలేదని అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News