కక్కుర్తికి పోయి చేతులారా చేజార్చుకుంటున్నారా?

ఆత్మవిశ్వాసం తప్పు లేదు. కానీ.. అదే ఆత్మవిశ్వాసం మితిమీరి.. ఓవర్ కాన్ఫిడెన్సుగా మారితేనే అసలు ఇబ్బంది అంతా

Update: 2023-11-21 05:01 GMT

ఆత్మవిశ్వాసం తప్పు లేదు. కానీ.. అదే ఆత్మవిశ్వాసం మితిమీరి.. ఓవర్ కాన్ఫిడెన్సుగా మారితేనే అసలు ఇబ్బంది అంతా. ఇప్పుడు అలాంటి తీరునే కాంగ్రెస్ అభ్యర్థులు ప్రదర్శిస్తున్నారా? అన్నది ప్రశ్నగా మారింది. తాజాగా బయటకు వినిపిస్తున్న వాదనల్ని చూస్తే.. చేజేతులారా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులతో గెలుపు అవకాశాల్ని చేజార్చుకుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి బలంగా వీస్తుందనన మాట అందరి నోట వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ తరహా ప్రచార వేళ.. మరింత ఆచితూచి అడుగులు వేస్తే.. గెలుపు వాకిట్లో ఉన్నట్లే అవుతుంది. అయితే.. ఇలాంటి వేళ మనసులో ఏ మూల కూడా రాకూడని ఓవర్ కాన్ఫిడెన్సు కాంగ్రెస్ అభ్యర్థుల్లో మొదలైనట్లుగా చెబుతున్నారు.

ఎన్నికల రాజకీయాల్లోనూ.. క్రికెట్ మ్యాచ్ లోనూ ఒకేలాంటి రిథమ్ మొదట్నించి చివరి వరకు ఉండాలి. ఈ విషయంలో ఏ మాత్రం తేడా కొట్టినా మొదటికే మోసం వస్తుంది. ఈ విషయాన్ని గుర్తించాల్సిన కాంగ్రెస్ అధినాయకత్వం అభ్యర్థుల్ని ఎప్పటికప్పుడు అలెర్టుగా ఉంచాల్సిన బాధ్యత దాని మీద ఉంది. కానీ.. అలాంటిదేమీ జరుగుతున్న సూచనలేవీ కనిపించట్లేదు. గడిచిన నెల వ్యవధిలో.. మరింత స్పష్టంగా చెప్పాలంటే గడిచిన పదిహేను రోజుల్లో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందన్న మాట వినిపిస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్ శివారు అయిన ఎల్ బీనగర్.. శేరిలింగంపల్లి.. కూకట్ పల్లి స్థానాల్లో కాంగ్రెస్ గెలిచేందుకు అవకాశం ఉందంటున్నారు. కానీ.. ఆయా స్థానాల్లోని అభ్యర్థుల తీరు అవసరానికి మించిన ఓవర్ కాన్ఫిడెన్సులో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో.. వారు చేసే ఖర్చు విషయంలోనూ తేడా కొడుతుందని చెబుతున్నారు. గెలుస్తామన్న ధీమాతో పెట్టాల్సిన కనీస ఖర్చు విషయంలోనూ కక్కుర్తికి పోవటం వల్ల మొదటికే మోసం వస్తుందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇప్పటికైనా కాంగ్రెస్ కళ్లు తెరిచి సరైన వ్యూహరచన చేస్తే తప్పించి లెక్కల్ని మార్చటం కుదరదన్న మాట వినిపిస్తోంది. మరి..కాంగ్రెస్ ఏం చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News