తెలంగాణలో కాంగ్రెస్ కామ్రేడ్స్ చెట్టాపట్టాల్

తెలంగాణా కాంగ్రెస్ కొత్త ఎత్తులు వేస్తోంది. నిన్నటి దాకా బీయారెస్ కొమ్ము కాసి ఇపుడు ఆ పార్టీ దూరం పెట్టిన తరువాత ఒంటరి అయిన కామ్రేడ్స్ తో పొత్తులకు సై అంటోంది.

Update: 2023-08-27 08:18 GMT

తెలంగాణా కాంగ్రెస్ కొత్త ఎత్తులు వేస్తోంది. నిన్నటి దాకా బీయారెస్ కొమ్ము కాసి ఇపుడు ఆ పార్టీ దూరం పెట్టిన తరువాత ఒంటరి అయిన కామ్రేడ్స్ తో పొత్తులకు సై అంటోంది. కామ్రేడ్స్ కి నల్గొండ, ఖమ్మం వంటి చోట్ల బలం ఉంది. కనీసంగా ఇరవై అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రభావితం చేస్తారని అంటున్నారు.

అటువంటి కామ్రేడ్స్ ని కేసీయార్ మునుగోడు ఉప ఎన్నికల వేళ ఉపయోగించుకున్నారు. అయితే ఆ తరువాత పొత్తుల విషయం వచ్చేసరికి సీపీఐ సీపీఎంలకు చెరో సీటు మాత్రమే ఇస్తామని బీయారెస్ చెప్పింది. తమకు చెరో మూడు సీట్లు ఇచ్చినా ఓకే అని కామ్రేడ్స్ చెప్పినా కూడా కేసీయార్ అంగీకరించలేదని అంటారు.

మొత్తానికి చూస్తే కేసీయార్ తో పొత్తు చెడింది. కాంగ్రేడ్స్ మండిపోతున్నాయి. ఈ కీలక టైం లో వారిని తమతో కలుపుకుని ముందుకు సాగేందుకు కాగ్రెస్ రెడీ అవుతోంది. లేటెస్ట్ పరిణామం ఏంటి అంటే ఉభయ కమ్యూనిస్టు నేతలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్ థాక్రే ఫోన్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్దామని కమ్యూనిస్టులను ఆయన కోరినట్టు తెలుస్తోంది.

దీనికి కామ్రేడ్స్ సైతం సానుకూలంగా రియాక్ట్ అయ్యే చాన్స్ ఉందని అంటున్నారు. ఎందుకంటే తెలంగాణాలో కామ్రేడ్స్ కి సొంతంగా ఉన్న బలం గెలిచేందుకు సరిపోదు, అందువల్ల వారికి పొత్తుల ద్వారా సీట్లు ఇస్తే తమతో ఉన్న పార్టీలను వారు గెలుపు బాటలోకి తీసుకుని వెళ్తారు. ఈ రకంగా వామపక్షాలతో లాభం ఉంది.

అయితే కామ్రేడ్స్ పది సీట్ల దాకా డిమాండ్ చేస్తున్నారు అని అంటున్నారు. అన్ని సీట్లు ఇవ్వడానికి మాత్రం కాంగ్రెస్ అంగీకరించే అవకాశాలు లేవు అనే అంటున్నారు. ఎందుకంటే నల్గొండ, ఖమ్మంలలో కాంగ్రెస్ కి కూడా బలం ఉంది. దంతో వారు కోరుకున్న కొన్ని చోట్ల గౌరవప్రదమైన సీట్లను ఇవ్వడం ద్వారా తమతో కలుపుకుని ముందుకు సాగాలని చూస్తోంది అని అంటున్నారు.

ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు చెరి మూడు సీట్లు లభించే అవకాశం అయితే ఉంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే కామ్రేడ్స్ ఇపుడు మంచి కసి మీద ఉన్నారు. ముఖ్యంగా కేసీయార్ మీద రగిలిపోతున్నారు. దాంతో వారి కసిని సొమ్ము చేసుకోవడానికి కాంగ్రెస్ వేగంగా పావులు కదుపుతోంది అని అంటున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చి మోసగాడని, స్నేహబంధాన్ని మరిచి కమ్యూనిస్టులను దూరం పెడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించడం ఇందుకు నిదర్శనం. అలాగే సీపీఎం కూడా కేసీయార్ మీద నిప్పులు చెరుగుతోంది. ఈ పరిణామాలను సానుకూలం చేసుకోవడానికి కాంగ్రెస్ చూస్తోంది అని అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే కాంగ్రెస్ తో కలసి కామ్రేడ్స్ చెట్టాపట్టాల్ వేస్తాయని అంటున్నారు. 2004 ఎన్నికల వేళ ఈ పొత్తు కాంగ్రెస్ కి కలసి వచ్చింది. మళ్లీ ఇపుడు అలాంటి వాతావరణమే ఉందని అంటున్నారు.

Tags:    

Similar News