ఇంత ఊపులో రొచ్చులో పడుతున్న కాంగ్రెస్ బాగుపడేదెలా?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగుతోందని ఓ వైపు అంచనాలు వెలువడుతుంటే మరోవైపు అదే కాంగ్రెస్‌లో చీలికలు..లుకలుకలు... అవమానాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయని అంటున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగుతోందని ఓ వైపు అంచనాలు వెలువడుతుంటే మరోవైపు అదే కాంగ్రెస్‌లో చీలికలు..లుకలుకలు... అవమానాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయని అంటున్నారు. కాంగ్రెస్ తొలి జాబితాతో అసంతృప్త సెగ మొదలవగా, రెండో జాబితాతో నిరసనజ్వాలలు మిన్నంటాయి. టికెట్ అమ్మకాల రచ్చ, రెబల్ నేతల హెచ్చరికలు, వరుస రాజీనామాల లొల్లితో ఆ పార్టీపై ప్రజల్లో అనుమానాలు స్టార్టయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఏఐసీసీ నేతల ఎన్నికల ప్రచారయాత్రకు మధ్యలోనే బ్రేక్ పడి ఆ పార్టీ నవ్వుల పాలవుతోంది.
సోమవారం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ బస్సుయాత్ర జరుగాల్సి ఉన్నది. దీనికి రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, ఖర్గే లాంటి నేతలు వస్తారని ప్రచారం చేశారు. అయితే 'అనివార్య కారణాల వల్ల బస్సుయాత్రను రద్దు చేస్తున్నాం' అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించాల్సి వచ్చింది. ఈ అనివార్య కారణాలు ఏంటనే విషయమే ఆసక్తికరంగా మారింది. టికెట్లు అమ్ముకున్నారంటూ సొంత పార్టీ నేతలే రోడ్లెక్కడ్డం, ధర్నాలు చేస్తామని బెదిరించడం వంటి పరిణామాలు అగ్రనేతల దృష్టికి వెళ్లినట్టు సమాచారం. బస్సుయాత్రకు ముగ్గురు నేతల్లో ఎవరు హాజరవుతారనే అంశంపై ఆదివారం సాయంత్రం వరకు ఢిల్లీ నుంచి స్పష్టత రాలేదని, రాష్ట్ర నేతలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వలేదని సమాచారం. అంతర్గత కుమ్ములాటలు, టికెట్ల అమ్మకాల నిరసనలకు భయపడే ఇలా జరిగిందని, అయితే ఇవన్నీ చెప్పుకోలేక 'అనివార్య కారణాల వల్ల బస్సుయాత్రను రద్దు చేస్తున్నాం' అని ప్రకటించుకున్నారని ఎద్దేవా చేస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్‌లో 'ముఖ్యమంత్రి' పదవి రచ్చ మొదలైంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ పెట్టిన మంటతో పార్టీలోని సీనియర్లంతా కుతకుతలాడుతున్నారు. శనివారం తాండూరులో జరిగిన ప్రచార సభలో రేవంత్‌ను సీఎం అభ్యర్థిగా సంబోధించటంపై సీనియర్లు మండిపడుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ తన ప్రసంగంలో రేవంత్‌రెడ్డి పేరు ఎత్తకున్నా.. ఆయన మాటల తెలుగు అనువాదంలో మాత్రం 'రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు' అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇది రేవంత్‌రెడ్డి కావాలనే చెప్పించుకున్నాడని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ వేడి తగ్గేంతవరకు బ్రేక్ ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలే యాత్రను వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది.