ఖమ్మం టికెట్ కు కాంగ్రెస్ సీనియర్ గట్టి బెట్టు.. భట్టిపై పట్టు
అయితే, ఇంత చేసినా ఆయనకు ఎన్నికల ప్రజా క్షేత్రంలో మాత్రం బలం లేదు.
కాంగ్రెస్ అధిష్ఠానం రాముడైతే.. ఆ అధిష్ఠానానికి ఆయనను హనుమంతుడు అని చెబుతారు. పార్టీ అధికారంలో ఉండీ ఆయనకు పదవులు రాకున్నా.. పార్టీ ప్రతిపక్షానికి పరిమితమై ఆయనకు ఎలాంటి పదవీ లేకున్నా.. కాంగ్రెస్ ను మాత్రం వదలరు. అంతేకాదు.. ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లిపోతారు. మరీ ముఖ్యంగా బడుగు-బలహీన వర్గాల వారి గొంతుకగా నిలుస్తుంటారు. అయితే, ఇంత చేసినా ఆయనకు ఎన్నికల ప్రజా క్షేత్రంలో మాత్రం బలం లేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం ఆయనకు బహుదూరం.
ఖమ్మం టికెట్ కోసం..
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకుని.. తనకే ఇవ్వాలంటూ గతంలో వ్యాఖ్యానించిన ఆయన ఇప్పుడు ఏకంగా పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. అంతేకాక.. డిప్యూటీ సీఎ భట్టి విక్రమార్కను టార్గెట్ చేసుకున్నారు. యథాప్రకారం అధిష్ఠానం మనిషి అయిన ఆయన.. ఢిల్లీ వెళ్లి మరీ ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలకు దిగారు. ‘భట్టిని ఎమ్మెల్సీని చేసింది నేనే. అలాంటాయన నాకు ఖమ్మం లోక్ సభ సీటు రాకుండా ద్రోహం చేస్తున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారో మరి..? మొదట సీటు ఇస్తామన్నారు.. ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు. ఈరోజు భట్టి పార్టీలో ఆ స్థానంలో ఉన్నాడంటే అందుకు నేనే కారణం’’ అని వ్యాఖ్యానించారు.
నేను లోకల్ కాకుంటే.. మరి వారు..?
పార్టీ అగ్ర నేతలు సోనియా, రాహుల్ తనకు న్యాయం చేయాలని వీహెచ్ కోరారు. తన కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లో లేరని.. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన తాను ఖమ్మం టికెట్ అడుగుతున్నానని.. తనను లోకల్ కాదు అంటున్నారని.. మరి గతంలో గెలిచిన రేణుకా చౌదరి, నాదెండ్ల భాస్కర్ రావు, రంగయ్య నాయుడు లోకల్ నాయకులా? అని సూటిగా ప్రశ్నించారు. ఖమ్మంలో కచ్చితంగా గెలుస్తానని అన్నారు. బీసీల ఓట్లు కాంగ్రెస్ కు అవసరం లేదా? బీసీలు ఓట్లు వేసే యంత్రాలు మాత్రమేనా?అని నిలదీశారు.
రాహుల్ న్యాయం చేయాలి..
భారత్ జోడో న్యాయ్ యాత్ర, కుల గణన అంటున్న రాహుల్ గాంధీ అయినా తనకు న్యాయం చేయాలని వీహెచ్ కోరారు. ఇతరులు ఎవరూ కాకుండా ఖమ్మం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తే తప్పుకుంటానని చెప్పారు. చనిపోయే వరకు పార్టీలోనే ఉంటానని.. చనిపోయిన తరువాత పార్టీ జెండా నాపై ఉంటుందని వీహెచ్ అన్నారు. పార్టీ మారే వ్యక్తిని కాదని.. పార్టీలో ఎందరికో సహాయం చేశానని చెప్పుకొచ్చారు. వయసు తనకు అడ్డంకి కాదంటూ వ్యాఖ్యలు చేశారు. తనలాగా చురుగ్గా పనిచేసేవారు పార్టీలో ఎవరూ లేరని అన్నారు.