హమ్మయ్యః ఎట్టకేలకు షర్మిల విలీనానికి కాంగ్రెస్ ఓకే
తెలంగాణలో తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాటి పాలనను సాకారం చేసుకునే లక్ష్యంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిలకు ఎట్టకేలకు తీపికబురు దక్కింది.
తెలంగాణలో తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాటి పాలనను సాకారం చేసుకునే లక్ష్యంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిలకు ఎట్టకేలకు తీపికబురు దక్కింది. కాంగ్రెస్‌లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనానికి బ్రేకులు పడిన ఎపిసోడ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ఆర్‌టీపీ విలీన ప్రక్రియ తుది దశకు చేరుకుందని, ఢిల్లీ పెద్దలకు సైతం ఓకే చేశారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ కి వైఎస్ షర్మిల పెట్టిన గడువు నేటితో ముగుస్తున్న తరుణంలో ఆమెకు ఈ తీపికబురు దక్కడం గమనార్హం.
2021లో షర్మిల వైఎస్సార్‌టీపీని స్థాపించి ధర్నాలు, నిరసనలతో ప్రభుత్వంపై వివిధ రూపాల్లో పోరాటం చేశారు. ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర కూడా చేసి తన ఉనికి చాటుకున్నారు. 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించి తమ పార్టీలో నేతలను తీర్చిదిద్దుతామని ప్రకటించారు. అయితే అనుకున్నంత ఆదరణ దక్కలేదు. పార్టీ సంస్థాగతంగా బలపడకపోవడం, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ ముఖ్యనేతలైన కొండా రాఘవరెడ్డి, గట్టు రామచంద్రారావు, ఇందిరా శోభన్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో విలీనంపై దృష్టి పెట్టి చర్చలు జరపగా అన్నీ అపశకునాలే ఎదురయ్యాయి.
కాంగ్రెస్‌లో వైఎస్ఆర్‌టీపీ విలీన వార్తలతో తుంగతుర్తి నుంచి అభ్యర్థిగా ప్రకటించిన ఏపూరి సోమన్న బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక కాంగ్రెస్‌లోనూ ఆమెకు చుక్కెదురు అయింది. కాంగ్రెస్ లోకి షర్మిల వస్తే పార్టీకి నష్టమని రాష్ట్ర నేతలు విలీనాన్ని అడ్డుకున్నట్లు వార్తలు వచ్చాయి. పార్టీలో షర్మిల వన్ మ్యాన్ షో తప్పితే బలమైన క్యాడర్ లేదని హైకమాండ్‌కు పలు నివేదికలు సైతం పంపించినట్లు తెలిసింది. దీంతో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో విలీనానికి చక్రం తిప్పి పలుమార్లు హైకమాండ్ తోనూ సంప్రదింపులు జరిపినప్పటికీ ... షర్మిలను ఢిల్లీ పెద్దలు లైట్ తీసుకున్నారు. దీంతో 30వ తేదీలోగా విలీనం అంశం తేల్చకపోతే తమ దారి తాము చూసుకుంటామని షర్మిల అల్టిమేటం ఇచ్చారు.
షర్మిల పెట్టిన గడువు పూర్తిగా సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు రంగంలోకి దిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వైఎస్ షర్మిలతో చర్చలు జరిపిన సునీల్ కనుగోలు ఈ సందర్భంగా విలీన ప్రక్రియను తుది దశకు చేర్చినట్లు సమాచారం. వైఎస్ఆర్‌టీపీ విలీన ప్రక్రియ పూర్తి చేసేందుకు ఆదివారం లేదా సోమవారాల్లో వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్లి సోనియా, రాహుల్‌గాంధీ ల సమక్షంలో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా చిట్టచివరి నిమిషంలో కాంగ్రెస్ పెద్దల కరుణ షర్మిలపై కనిపించిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.