దేశంలో కొత్త వేరియంట్ ఇదే.. తప్పించుకునే మార్గం ఉందట
ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి కరోనా.. ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకొని.. కొత్త వేరియంట్ల రూపంలోవిరుచుకుపడటం తెలిసిందే.
ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి కరోనా.. ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకొని.. కొత్త వేరియంట్ల రూపంలోవిరుచుకుపడటం తెలిసిందే. మరో కొత్త వేరియంట్ గడిచిన కొద్ది రోజులుగా దేశంలో వ్యాప్తి చెందుతోంది. ఆదివారం ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 335 కొత్త కేసులు నమోదు కావటం ఉలిక్కిపడేలాచేసింది. వీరిలో ఐదుగురు మరణించారు. ఇటీవల నమోదు అవుతున్న వరుస కరోనా కేసులతో దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 1701కు చేరింది.
ఈ కొత్త వేరియంట్ ను జేఎన్1గా పిలుస్తున్నారు. దీన్ని తొలిసారి సెప్టెంబరులో అమెరికాలో గుర్తించారు. డిసెంబరు 15న చైనాలో ఏడు కేసులునమోదు అయ్యాయి. మన దేశంలో తొలిసారి డిసెంబరు ఎనిమిదిన ఈ కొత్త వేరియంట్ ను గుర్తించారు. కేరళలోని తిరువనంతపురంలో 79 ఏళ్ల మహిళకు ఈ కొత్త వేరియంట్ సోకింది. అయితే.. ఆమె ఈ వేరియంట్ నుంచి కోలుకున్నారు. ఇంతకూ ఈ కొత్త వేరియంట్ ప్రభావం ఎలా ఉంటుంది? దీంతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయన్న విషయంలోకి వెళితే..
కొత్త వేరియంట్ (జేఎన్1) పిరోలా వేరియంట్ వారసురాలిగా చెబుతున్నారు. దీని ప్రభావంతో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందేందుకు స్పైక్ ప్రోటీన్ కీలకంగా వ్యవహరిస్తుంది. జ్వరం.. ముక్కు కారటం.. గొంతు నొప్పి.. దగ్గు లాంటివి ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటారు. కొన్ని సందర్భాల్లో జీర్ణాశయ సమస్యలు కూడా ఎదురు కావొచ్చు. కరోనాకు ప్రధమ శత్రువైన మాస్కులు ధరించటం.. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవటం.. సామాజిక దూరం పాటించటం లాంటి జాగ్రత్తలతో ఈ కొత్త వేరియంట్ నుంచి కూడా తప్పించుకునే వీలుంది. ఎందుకైనా.. కాస్తంత జాగ్రత్తగా ఉండటం మంచిది.