రోటీన్ కు భిన్నం ఈ పెళ్లి.. జస్ట్ 2 నిమిషాల్లో పూర్తి
గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో కొందరు పెళ్లిళ్లను పూర్తి ట్రెడిషనల్ పద్దతిలో మూడు రోజులు.. ఐదు రోజులు పెళ్లి వేడుకను నిర్వహిస్తున్నారు.
పెళ్లికి ఇచ్చే ప్రాధాన్యత.. దాని కోసం చేసే ఏర్పాట్లు.. పెట్టే ఖర్చు అంతా ఇంతా కాదు. శక్తి ఉందా? లేదా? అన్నది పట్టించుకోకుండా.. జీవితంలో ఒక్కసారి జరిగే పెళ్లి కోసం ఆర్థికంగా ఉన్న వారు మాత్రమే కాదు.. లేనోళ్లు సైతం ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం.. ఈ క్రమంలో అప్పులు పాలు కావటం లాంటివి చాలానే వింటుంటాం. అయినప్పటికీ పెళ్లిని గ్రాండ్ గా జరిపేందుకే ఆసక్తిని చూపుతుంటారు. ఎంత లేనోళ్లు అయినా సరే.. పెళ్లి వేళ వారు చేసే ఖర్చు లెక్క చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో కొందరు పెళ్లిళ్లను పూర్తి ట్రెడిషనల్ పద్దతిలో మూడు రోజులు.. ఐదు రోజులు పెళ్లి వేడుకను నిర్వహిస్తున్నారు. పెళ్లికి ముందు ప్రీవెడ్డింగ్ షూట్స్ అంటూ అదరగొట్టేస్తున్నారు. అయితే.. ఈ సందడి.. హడావుడి అన్నది లేకుండా కేవలం ఉంగరాలు మార్చుకోవటం.. పూలదండలు వేసుకోవటం లాంటి సింఫుల్ కార్యక్రమాలతో పెళ్లి ప్రోగ్రాంను పూర్తి చేయటం ఆసక్తికరంగా మారింది.
ఇస్పెషల్ గా మారిన ఈ పెళ్లి వేడుక హైదరాబాద్ మహానగర శివారులో చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం శ్రీరామచంద్ర మిషన్ హార్ట్ ఫుల్ నెస్ సెంటర్ లో రూపాయి ఖర్చు లేకుండా యువ జంట పెళ్లి చేసుకున్నారు. ఈ సంస్థ దాజీగా పేర్కొనే కమలేష్ డి పటేల్ సమక్షంలో వధూవరులు ఇద్దరు ఉంగరాలు మార్చుకొని పూలదండలు వేసుకోవటం ద్వారా పెళ్లి కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
ఆడంబరం అన్నది లేకుండా సింఫుల్ గా పూర్తైన ఈ పెళ్లికి సంబంధించి వధూవరుల విషయానికి వస్తే.. అమ్మాయి పేరు శ్రీవాణి గాయత్రి. కర్ణాటకకు చెందిన ఆమె శంషాబాద్ లో ఒక నర్సరీలో పని చేస్తుంటారు. ఇక.. అబ్బాయి విషయానికి వస్తే..సరవేశ్వరానంద్ జార్ఖండ్ నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిన యువకుడు. ఈ కామర్స్ సంస్థలో జాబ్ చేస్తుంటారు. వీరిద్దరూ కన్హా ఆశ్రమానికి తరచూ రావటం.. ఇద్దరి మనసులు కలవటంతో.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తమను కలిపిన ఆశ్రమంలోనే పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. ఇందుకోసం పెళ్లిని సింఫుల్ గా రెండంటే రెండు నిమిషాల్లో పూర్తి చేయటం ఆసక్తికరంగా మారింది.