కల్తీ లడ్డూ వివాదం.. పవన్‌కు చుక్కెదురు!

ఈ వివాదంలో తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు చుక్కెదురైంది.

Update: 2024-11-23 09:50 GMT

తిరుమల లడ్డూ విషయంలో నెలకొన్న వివాదం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ చర్చకు దారితీసింది. అధికార టీడీపీ, మొన్నటివరకు అధికారంలో ఉన్న వైసీపీ మధ్య రాజకీయంగా పెను దుమారం రేపింది. నువ్వు అపచారం చేశావంటే.. నువ్వు అపచారం చేశావంటూ.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. అటు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగానూ హిందువులు ఆందోళనలు చేశారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ, టీటీడీ పవిత్రతను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ఈ వివాదంలో తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు చుక్కెదురైంది.

తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సీరియస్‌గా స్పందించారు. ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు ఏం చేయాలనే దానిపై ఆగమ పండితుల నుంచి సలహాలు సైతం స్వీకరించారు. మఠాధిపతులు, పీఠాధిపతులతో చర్చించారు. శుద్ధి జరపడమా..? లేక సంప్రోక్షణలు చేయడమా..? లేక ఆగమ శాస్త్రంలో మరేమైనా పద్ధతులు ఉన్నాయా అని అభిప్రాయాలు తీసుకున్నారు.

ఇటు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఇదే అంశంపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. తిరుమల పవిత్రతను దెబ్బతీశారని అంటూ ఆయన ఏకంగా ప్రాయశ్చిత్తా దీక్షను స్వీకరించారు. ఆలయాలను శుభ్రం చేశారు. అలా.. కొన్ని రోజులపాటు హడావిడి చేశారు. బాధ్యులు ఎవరైనా ఎవరినీ వదిలిపెట్టేది లేదంటూ మీడియా ముందు వాపోయారు. టీటీడీ పవిత్రతను కాపాడుతామంటూ శపథం బూనారు. చివరకు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తన దీక్షను విరమించుకున్నారు.

అయితే.. తిరుమల లడ్డూ తయారీలో గత వైసీపీ ప్రభుత్వం కల్తీ నెయ్యి వాడిందంటూ పవన్ కల్యాణ్ నిరాధార ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో పవన్ కల్యాణ్‌తోపాటు తెలంగాణ సీఎస్, హోంశాఖ అధికారికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం వీరు విచారణ రావల్సి ఉంది. కానీ.. వారు అటెండ్ కాలేదు. దీంతో పవన్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో చుక్కెదురైంది. వీరందరికీ వ్యతిరేకంగా ఎక్స్‌పార్టే ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో ఈ ముగ్గురు కూడా కోర్టు ఎదుట హాజరై వివరణ ఇచ్చుకునే అవకాశాన్ని కోల్పోయినట్లు న్యాయస్థానం ప్రకటించింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

Tags:    

Similar News