మాచర్ల ఈవీఎం ధ్వంసం కేసులో కీలక పరిణామం... జైలు వద్ద అలర్ట్!

ఈ క్రమంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈవీఎంల ధ్వంసం కేసు, హత్యాయత్నం వంటి కేసులు నమోదయ్యాయి

Update: 2024-08-23 12:20 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది మే 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం లు ధ్వంసం చేసిన ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈవీఎంల ధ్వంసం కేసు, హత్యాయత్నం వంటి కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు బెయిల్ మంజూరైంది.

అవును... ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నాడు జరిగిన ఈవీఎంల ధ్వంసం ఘటనలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఆ కేసుల్లో అతనికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు కండిషన్స్ పెట్టింది. దేశం విడిచి వెళ్లొద్దని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. పాస్ పోర్టును సమర్పించాలని తెలిపింది.

ఎన్నికల పోలింగ్ సమయంలో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరి రావుపై దాడి కేసు, పోలింగ్ తర్వాత కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై దాడి కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణార్డ్డిపై కేసులు నమోదయ్యాయి. అయితే.. ఈ రెండు కేసుల్లోనూ ఏపీ ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా రూ.50 వేలతో రెండు పూచీ కత్తులు సమర్పించాలని తెలిపింది.

ఇదే క్రమంలో... విచారణ అధికారి దగ్గరకు వారానికి ఒకసారి వెళ్లి సంతకం చేయాలని కోర్టు షరతు విధించింది. దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. ఇలా పిన్నెల్లికి బెయిల్ మంజూరైన నేపథ్యంలో... నెల్లురులోని కేంద్ర కారాగారం వద్ద పోలీసులు అప్రమత్తమయ్యారు.. జైలు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.

కాగా... ఈవీఎంలు ధ్వంసం, హత్యాయత్నం వంటి కేసుల్లో పోలీసులు పిన్నెల్లిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో జూన్ 26 నుంచి పిన్నెల్లి నెల్లూరు జైలులోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆయన తరుపు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తాజాగా పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వ్యులిచ్చింది.

Tags:    

Similar News