''ఆపదలో ఆడపిల్ల..'' ఇలాంటి వాట్సప్ కాల్ వస్తే జాగ్రత్త

ఈ బలహీనతనే ఆసరాగా చేసుకుని కొందరు వాట్సప్ ద్వారా బెదిరింపులకు దిగుతున్నారు.

Update: 2024-09-12 14:30 GMT

పిల్లలంటే ఏ తల్లిదండ్రులకైనా కంటిపాపలు.. పెద్దయ్యాక ఎలా ఉంటారనేది తర్వాత సంగతి. వారిని ప్రయోజకులను చేయాలని అహరహం తపిస్తుంటారు. వారి చదువుల కోసం తమ జీవితాలను త్యాగం చేస్తుంటారు. వారికి ఏమైనా జరిగితే విలవిల్లాడిపోతుంటారు. ఈ బలహీనతనే ఆసరాగా చేసుకుని కొందరు వాట్సప్ ద్వారా బెదిరింపులకు దిగుతున్నారు. ఇలాంటివాట్ల తల్లిదండ్రులూ బహుపరాక్ అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సైబర్ నేరగాళ్ల పనే..

ఇటీవలి కాలంలో నగరాల నుంచి పల్లెల వరకు సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్న సంగతి తెలిసిందే. వీరి బారిన పడి పేదల నుంచి ధనికుల వరకు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు మరో రూపంలో వస్తున్నారు. అమ్మాయిల తల్లిదండ్రులను బెదిరించడం తమ పంథాగా చేసుకుంటున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లడం వారు కిడ్నాప్‌ నకు గురయ్యారని పేర్కొంటూ డిమాండ్ చేసి డబ్బును బదిలీ చేయాలని.. లేకుంటే అమ్మాయిలను చంపేస్తామని బెదిరిస్తున్నారట. అందుకే పిల్లలు కిడ్నాప్‌ నకు గురయ్యారనే వాట్సాప్ కాల్స్ వస్తే ప్రజలు, ముఖ్యంగా అమ్మాయిల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని టీజీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ కోరుతున్నారు.

హైదరాబాద్ లో సంఘటన

సజ్జనార్ తెలిపినదాని ప్రకారం.. సైబర్ నేరగాళ్లు హైదరాబాద్‌ రాయదుర్గంలో ఓ విద్యార్థిని తల్లిదండ్రులకు విదేశీ ఫోన్ నంబర్‌ నుంచి కాల్ చేశారు. తాము అడిగినంత డబ్బు బదిలీ చేయాలని కోరారు. అలా చేయకుంటే మీ అమ్మాయిని చంపేస్తామని బెదిరించారు. అంతేకాదు.. ఇదిగో ‘మీ కూతురు ఏడుస్తోంది’ అంటూ.. ఓ ఏడుపు వినిపించారు.

తల్లిదండ్రులు అప్రమత్తం..

ఇందులోని గొంతు విని.. తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లిన తమ కుమార్తె కిడ్నాప్ అయిందనే భావించి నమ్మి, కిడ్నాపర్లకు డబ్బును బదిలీ చేయడానికి సిద్ధమయ్యారు. ఇంతలో అప్రమత్తమైన తల్లిదండ్రులు.. నేరస్థులతో మాట్లాడుతూనే వారి కుమార్తె గురించి బంధువులలో ఒకరిని అప్రమత్తం చేశారు. కాగా, చివరకు తమ కుమార్తె కళాశాలలో క్షేమంగా ఉందని బంధువులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. సైబర్ నేరగాళ్లపై లీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదో కొంత పంథా

పిల్లల కిడ్నాప్ నకు సంబంధించి ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని, ఆడ పిల్లలు ఆపదలో ఉన్నారని నమ్మి తల్లిదండ్రులు కిడ్నాపర్లకు డబ్బులు పంపిస్తున్నారని సజ్జనార్ తెలిపారు. విదేశీ నంబర్ల నుంచి వచ్చే వాట్సాప్ కాల్‌ లను నమ్మవద్దని, కిడ్నాప్ బెదిరింపులకు కూడా స్పందించవద్దని సూచించారు. తక్షణమే పోలీసులను సంప్రదించి సాయం కోరాలని తెలిపారు.

Tags:    

Similar News