క్రిమినల్‌ కేసులున్న ఎంపీలు వీరే.. ఏడీఆర్‌ సంచలన నివేదిక!

రాజకీయాల్లో ఒకప్పుడు దేశభక్తులు, సేవాతత్పరులు, ప్రజల కోసం తమ ఆస్తులను త్యాగం చేసినవారు మాత్రమే ఉండేవారు

Update: 2023-09-13 04:22 GMT

రాజకీయాల్లో ఒకప్పుడు దేశభక్తులు, సేవాతత్పరులు, ప్రజల కోసం తమ ఆస్తులను త్యాగం చేసినవారు మాత్రమే ఉండేవారు. ప్రస్తుతం రాజకీయాలు కూడా మంచి కెరీర్‌ ప్రొఫెషన్‌ గా మారిపోయాయనే విమర్శలు ఉన్నాయి. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) తాజాగా క్రిమినల్‌ కేసులున్న ఉన్న రాజకీయ నేతల గురించి సంచలన నివేదిక వెలువరించింది.

పార్లమెంట్‌ ఉభయ సలయిన రాజ్యసభ, లోక్‌ సభల్లో ఏకంగా 40 శాతం (306 మంది) సిట్టింగ్‌ ఎంపీలపై క్రిమినల్‌ కేసులున్నాయని ఏడీఆర్‌ బాంబు పేల్చింది. ఈ 40 శాతం మందిలో 25 శాతం మంది (194 మంది)పై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయని వెల్లడించింది. అంటే.. ఈ 25 శాతం మంది ఎంపీలపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులు వంటివి ఉన్నాయని ఏడీఆర్‌ తెలిపింది. ఈ మేరకు నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ సంస్థతో కలిసి సిట్టింగ్‌ ఎంపీల అఫిడవిట్‌ లను పరిశీలించి వివరాలను వెల్లడించినట్టు ఏడీఆర్‌ ప్రకటించింది.

లోక్‌ సభ, రాజ్యసభ కలిపి ఉభయ సభల్లో మొత్తం 776 ఎంపీలకు గానూ 763 మంది ఎంపీలు ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించినట్టు ఏడీఆర్‌ పేర్కొంది. కొన్ని స్థానాలు ఖాళీగా ఉండడం, అఫిడవిట్లు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో కొన్నింటిని పక్కనపెట్టామని వివరించింది.

లోక్‌ సభలో మొత్తం 545 మంది ఎంపీలు, రాజ్యసభలో 250 మంది ఎంపీలు ఉంటారనే విషయం తెలిసిందే. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు మొత్తం 763 మంది సిట్టింగ్‌ ఎంపీల్లో 306 మంది (40 శాతం) మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని ఏడీఆర్‌ షాకింగ్‌ రిపోర్టు ఇచ్చింది. అందులో 194 మంది (25 శాతం)పై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయని తెలిపింది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణలోని 24 మంది ఎంపీల్లో 13 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని ఏడీఆర్‌ తెలిపింది. అందులో 9 మందిపై తీవ్రమైన నేరాలు ఉన్నట్లు బాంబు పేల్చింది.

ఇక పార్టీల వారీగా చూస్తే వైసీపీకి చెందిన 31 మంది ఎంపీల్లో 13 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని ఏడీఆర్‌ వెల్లడించింది. అందులో 11 మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు వివరించింది.

ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన 385 మంది ఎంపీల్లో 139 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్టు ఏడీఆర్‌ పేర్కొంది. వీరిలో 98 మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులున్నాయని వివరించింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 81 మంది ఎంపీల్లో 43 మందిపై క్రిమినల్‌ కేసులు, 26 మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నట్టు తెలిపింది.

అలాగే ఎంపీల ఆస్తుల పరంగా అత్యధికంగా తెలంగాణ ఎంపీల (24 మంది) సగటు ఆస్తి రూ.262.26 కోట్లుగా ఉందని ఏడీఆర్‌ వెల్లడించింది. ఆ తర్వాత 36 మంది ఏపీ ఎంపీల సగటు ఆస్తి రూ.150.76 కోట్లుగా ఉందని లె లిపింది.

పార్టీల వారీగా ఎంపీల ఆస్తులను పరిశీలిస్తే.. బీజేపీ ఎంపీల సగటు ఆస్తి 18.31 కోట్లుగా ఉందని ఏడీఆర్‌ వెల్లడించింది. కాంగ్రెస్‌ ఎంపీల సగటు ఆస్తి రూ.39.12 కోట్లుగా ఉందని పేర్కొంది.

వైసీపీ ఎంపీల సగటు ఆస్తి రూ.153.76 కోట్లుగా ఉందని ఏడీఆర్‌ తెలిపింది. అదేవిధంగా బీఆర్‌ఎస్‌ ఎంపీల సగటు ఆస్తి రూ.383.51 కోట్లుగా ఉందని వివరించింది.

తెలంగాణ ఎంపీల్లో ఏడుగురు, ఏపీ నుంచి 9 మంది ఎంపీలు బిలియనీర్లని ఏడీఆర్‌ తన నివేదికలో వెల్లడించింది. వైసీపీ ఎంపీల మొత్తం ఆస్తి రూ.4,766 కోట్లుగా ఉండగా బీఆర్‌ఎస్‌ ఎంపీల మొత్తం ఆస్తి రూ.6,163 కోట్లుగా ఉందని ఏడీఆర్‌ తన నివేదికలో పేర్కొంది. 763 ఎంపీల మొత్తం ఆస్తుల విలువ రూ.29,251 కోట్లుగా ఉందని ఏడీఆర్‌ షాకింగ్‌ విషయం చెప్పింది.

Tags:    

Similar News