మంచి మంచి కట్టుబాట్లు!... పేకాట క్లబ్బుల కోసం ఎమ్మెల్యే కృషి!!

ఎన్ని ఇబ్బందులైనా ఏపీని ప్రగతి బాటలో ముందుకు తీసుకెళ్తామని బాబు చెబుతున్నారు.. ఆ దిశగా కృషి చేస్తున్నట్లు చెబుతున్నారు.

Update: 2024-07-31 07:12 GMT

ఏపీలో టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదంటూ సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారమైతే చాలు ఆర్బీఐ వైపు చూస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఎన్ని ఇబ్బందులైనా ఏపీని ప్రగతి బాటలో ముందుకు తీసుకెళ్తామని బాబు చెబుతున్నారు.. ఆ దిశగా కృషి చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఇదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు తమ ప్రభుత్వ హయాంలో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తామని అంటున్నారు. చంద్రబాబు ఆలోచనలు అలా ఉంటే... టీడీపీ ఎమ్మెల్యే ఒకరు మాత్రం పేకాట క్లబ్బులు తెరిపించేందుకు ఇప్పటికే కలెక్టర్లతో మాట్లాడినట్లు చెబుతూ.. ఈ విషయాన్ని బాబు దృష్టికి తీసుకెళ్తానని చెబుతున్నారు.

అవును... అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... అనంతపురంలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా పేకాట క్లబ్బులను తెరిపించే అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఇప్పటికే తనవద్దకు చాలా మంది పేకాట క్లబ్బులు తెరిపించమని వస్తున్నారని.. వారికి ఈ మేరకు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు!

ఈ విషయంలో ఇప్పటికే తాను కలెక్టర్ తో మాట్లాడినట్లు తెలిపారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన... పేకాట ఆడకపోవడం వల్ల మనిషి జీవితకాలం తగ్గిపోయిందని వ్యాఖ్యానించడం గమనార్హం! ఈవ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక నెటిజన్లు తమ క్రియేటివిటీకి పని చెబుతూ సదరు ఎమ్మెల్యేపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇందులో భాగంగా... చంద్రబాబుతో మాట్లాడి పేకాట క్లబ్బులు తెరిపిస్తానంటూ టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ "మంచి మంచి కట్టుబాట్లు" అంటూ కామెంట్లు చేస్తున్నారు. "వాట్ ఏ విజన్.. వాట్ ఏ థాట్"? అంటూ స్పందిస్తునారు. "ఆ విధంగా ముందుకుపోదాం" అని ఒకరంటే... "ఇది నిజమైన ఆడుదాం ఆంధ్రా" అంటూ మరొకరు సెటైర్లు పేలుస్తున్నారు.

Tags:    

Similar News