అతడిని పవన్‌ కూడా రక్షించలేరు.. దామచర్ల హాట్‌ కామెంట్స్‌!

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

Update: 2024-09-26 11:23 GMT

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒంగోలు ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బాలినేనిపై గెలుపొందిన దామచర్ల జనార్దన్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలినేని జనసేనలో చేరినా వదిలేది లేదని.. ఆయనను పవన్‌ కళ్యాణ్‌ కూడా కాపాడలేరని హాట్‌ కామెంట్స్‌ చేశారు. బాలినేని అధికారంలో ఉన్నప్పుడు తనపై 33 కేసులు పెట్టారని.. తన అనుచరులపైనా వందల సంఖ్యలో కేసులు పెట్టించారని మండిపడ్డారు.

బాలినేని జనసేనలో చేరినా ఆయన పై చర్యలు తప్పవని దామచర్ల జనార్దన్‌ హెచ్చరించారు. అలాగే బాలినేనితోపాటు ఆయన కుమారుడు ప్రణీత్‌ రెడ్డిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. బాలినేనిని పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు పార్టీలో చేర్చుకుంటున్నారని అని ప్రశ్నించారు. పార్టీలో చేర్చుకున్నా బాలినేనిని కాపాడలేరని దామచర్ల హాట్‌ కామెంట్స్‌ చేశారు.

కాగా బాలినేని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1999 నుంచి వరుసగా గెలుస్తున్నారు. ఇప్పటివరకు ఐదుసార్లు విజయం సాధించారు. 2014, 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. బాలినేని, దామచర్ల ఎన్నికల్లో నాలుగుసార్లు తలపడగా చెరో రెండుసార్లు విజయం సాధించారు. బాలినేని 2012, 2019ల్లో, దామచర్ల 2014, 2024ల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

కాగా కొద్ది రోజుల క్రితం బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరాలని నిర్ణయించుకోవడంతో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌.. ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ ను కలిశారు. బాలినేని జనసేనలోకి వస్తే ఒంగోలులో తనకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆయన పవన్‌ దృష్టికి తెచ్చినట్టు సమాచారం. అయితే ఈ విషయంలో ఆందోళన వద్దని.. ఆ విషయాన్ని తాను చూసుకుంటానని పవన్‌.. దామచర్ల జనార్దన్‌ కు హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు.

కమ్మ సామాజికవర్గానికి చెందిన జనార్దన్‌ ప్రకాశం జిల్లా టీడీపీలో ముఖ్య నేతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసేనలో చేరుతున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆయన గట్టి హెచ్చరికలు పంపారు. కేసుల భయంతోనే ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరుతున్నారని.. అయినా ఆయనను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన కుమారుడు ప్రణీత్‌ రెడ్డి చేసిన అవినీతి, అక్రమాలను బయట పెడతామన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లుగా అవినీతి చేసి ఇప్పుడు పార్టీ మారి తనను తాను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

మరోవైపు బాలినేని కూల్‌ గా ఉన్నారు. తాను తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోవాలని వైసీపీలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశానని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికీ అదే మాటపైన కట్టుబడి ఉండానన్నారు. తాను, తన కుమారుడు తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చని, తమకు అభ్యంతరం లేదన్నారు.

కాగా బాలినేని శ్రీనివాసరెడ్డి పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో సెప్టెంబర్‌ 26న జనసేనలో చేరబోతున్నారు. ఈ క్రమంలో దామచర్ల ఆంజనేయులు చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. గత వారం పవన్‌ కల్యాణ్‌ను.. బాలినేని కలిశాక కూడా దామచర్ల జనార్దన్‌ ఇలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం. మరి ఈ సమస్యను అటు చంద్రబాబు, ఇటు పవన్‌ కళ్యాణ్‌ ఎలా పరిష్కరిస్తారో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News