చంద్రబాబును రేవంత్ ఫినిష్ చేశారు: దాసోజు

సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి...కేసీఆర్‌ను ఫినిష్ చేస్తామని వ్యాఖ్యానించడం ఏంటని విమర్శించారు.

Update: 2024-10-30 15:24 GMT

టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసు వ్యవహారం నేపథ్యంలో తెలంగాణలో చంద్రబాబును రేవంత్ రెడ్డి ఫినిష్ చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని త్వరలో రేవంత్ రెడ్డి భూస్థాపితం చేయడం ఖాయమని షాకింగ్ కామెంట్లు చేశారు. టీడీపీ నేతగా ఉన్న సమయంలో రేవంత్ చాలామంది సీనియర్ నేతలను ఫినిష్ చేశారని, కాంగ్రెస్‌లోకి వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ వంటి సీనియర్ లను ఫినిష్ చేశారని ఆరోపించారు.

సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి...కేసీఆర్‌ను ఫినిష్ చేస్తామని వ్యాఖ్యానించడం ఏంటని విమర్శించారు. కాంగ్రెస్ కు రేవంత్ భస్మాసురుడిలా తయారయ్యాని, రేవంత్ భాష, నెగిటివ్ మనస్తత్వం ఇలాగే ఉంటే... కాంగ్రెస్‌ను భూస్థాపితం అవుతుందని మంత్రులు, కాంగ్రెస్ కార్యకర్తలు, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ గుర్తించాలని దాసోజు కోరారు. వారంతా ఇప్పటికైనా నిద్రలేచి రేవంత్ రెడ్డికి గడ్డి పెట్టాలని హితవు పలికారు. రాజ్యాంగంపై గౌరవమున్నవారు ఫినిష్ చేస్తాం...అని వ్యాఖ్యానించరని, సీఎం స్థాయిలో ఉండి అలా మాట్లాడటం ఏంటని విమర్శించారు. తెలంగాణ వ్యతిరేకులు కూడా కేసీఆర్‌ను ఫినిష్ చేస్తామని చెప్పలేదని అన్నారు.

రేవంత్ కు ఇంకా ఫ్యాక్షన్‌ బుద్ధులు పోలేదని, రేవంత్ రెడ్డి కాదు... పెయింటర్ రెడ్డి అని సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి ఆంధ్రా నాయకుల బూట్లు మోస్తున్నప్పుడే కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రదాతపై దుర్మార్గమైన భాష మాట్లాడటం సిగ్గుచేటని, దమ్ముంటే కేసీఆర్‌తో రాజకీయంగా కొట్లాడాలని దాసోజు ఛాలెంజ్ చేశారు. రేవంత్ రెడ్డి కూర్చుంటున్న సచివాలయం కట్టింది, ఆయన తిరుగుతున్న రోడ్డు వేసింది, తాగుతున్న నీళ్లు ఇచ్చింది కేసీఆర్ అని గుర్తు చేశారు. కేసీఆర్ కృషి వల్ల తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ అయిందని, రేవంత్ భాష చూస్తుంటే అసలు అన్నం తింటున్నాడా? గడ్డి తింటున్నాడా? అనిపిస్తోందని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. మరి, దాసోజు వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతల రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

కాగా, రేవంత్ చెప్పులు మోసిన నాడు తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ ఊపిరి పోశాడని, పదవుల కోసం రేవంత్ పరితపిస్తున్న నాడు ఉన్న పదవిని కేసీఆర్ తృణప్రాయంగా వదిలేశాడని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణను సంపెటందుకు రేవంత్ బ్యాగులు మోస్తున్ననాడు, ఆయన తెలంగాణ భవిష్యత్‌కు ఊపిరి పోసాడు చిట్టినాయుడు అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. అటువంటి రేవంత్...కేసీఆర్ పేరును తుడిచేది? తెలంగాణ చరిత్ర కేసీఆర్ అని దుయ్యబట్టారు.

అంతకుముందు, కేసీఆర్ అవుట్ డేటెడ్ మెడిసిన్ అని, ఆయన గురించి మాట్లాడటం వ్యర్థం అని రేవంత్ రెడ్డి విమర్శించారు. సంవత్సరం తిరక్కుండానే కేసీఆర్‌ను ఫామ్ హౌజ్ లో నాలుగు గోడలకే పరిమితం చేశానని, కేసీఆర్‌ ఉనికి లేకుండా చేయడమే తన అభిమతమని, ఆ పని జరిగి తీరుందని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.

Tags:    

Similar News