స్కూళ్లకు బాంబు బెదిరింపులు... ఢిల్లీలో తీవ్ర కలకలం!
అవును.. బుధవారం ఉదయం ఢిల్లీ - ఎన్.సీ.ఆర్. ప్రాంతంలోని పదుల సంఖ్యలో స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బాంబు బెదిరింపులతో దేశ రాజధాని ఢిల్లీ ఉలిక్కిపడింది. ఇందులో భాగంగా... బుధవారం ఉదయం ఢిల్లీ - ఎన్.సీ.ఆర్. ప్రాంతంలోని పదుల సంఖ్యలో స్కూళ్లకు దాదాపు ఒకేసారి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో... అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాయి.
అవును.. బుధవారం ఉదయం ఢిల్లీ - ఎన్.సీ.ఆర్. ప్రాంతంలోని పదుల సంఖ్యలో స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాయి. ఇదే క్రమంలో... ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లను ను ఖాళీ చేయించాయి. ఈ సమయంలో స్కూళ్లకు చేరుకున్న పోలీసులు బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు.
ఈ క్రమంలో బుదవారం ఉదయం తొలుత ఢిల్లీ లోని చాణక్యపురి, ద్వారక, వసంత్ కుంజ్, మయూర్ విహార్, సాకేత్ స్కూళ్లకు బెదిరింపులు రాగా.. ఆ తర్వాత ఢిల్లీతోపాటు నోయిడాలోని సుమారు 80కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో... తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు ఆయా స్కూళ్లకు చేరుకుని తమ తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు.
మరోపక్క స్కూల్స్ వద్దకు చేరుకున్న పోలీసులు.. బాంబ్ డిటెక్షన్ బృందంతో తనిఖీలు చేయిస్తున్నారు. ఇదే క్రమంలో... అగ్నిమాపక సిబ్బంది కూడా పాఠశాల ప్రాంగణాల వద్దకు చేరుకున్నారు. అయితే... ప్రస్తుతానికి ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు. బెదిరింపులకు పాల్పడిన ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తుంది.
కాగా... ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ దేశరాజధాని ఢిల్లీలోని పలు స్కూళ్లకు ఇలాంటి బాంబు బెదిరింపులే వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు జరపగా ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో... అది నకిలీ బెదిరింపు అయి ఉంటుందని పోలీసులు అప్పట్లో వెల్లడించారు.