ఇంతకూ డీలిమిటేషన్‌ అంటే...?

దేశంలో లోక్‌ సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే

Update: 2023-09-22 09:00 GMT

దేశంలో లోక్‌ సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టగా రెండు సభలు.. లోక్‌ సభ, రాజ్యసభ ఆమోదించాయి. ఇక ఈ బిల్లును రాష్ట్రపతికి పంపనున్నారు. ఆమె సంతకంతో ఇది చట్ట రూపం దాల్చనుంది.

అయితే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఉండవని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించిన సంగతి తెలిసిందే. డీలిమిటేషన్‌ తర్వాత 2029 ఎన్నికల నుంచి చట్ట సభల్లో మహిళల రిజర్వేషన్లను అమలు చేసే అవకాశం ఉందని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో డీలిమిటేషన్‌ అంటే ఏంటనే చర్చ సాగుతోంది. మహిళా రిజర్వేషన్‌ బిల్లు సులువుగానే పార్లమెంటు ఆమోదం పొందినా డీలిమిటేషన్‌ తో లింకుపెట్టడంతో ఈ అంశం సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది.

మనదేశంలో పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కలు చేపడతారనే సంగతి తెలిసిందే. 2021లో జనాభా లెక్కలు నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనాతో దీనికి బ్రేక్‌ పడింది. 2022లోనూ కరోనా మహమ్మారి కొనసాగడంతో జనాభా లెక్కలు సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ మన దేశ జనాభాను అధికారికంగా 2011 లెక్కలతోనే చెబుతున్నారు. ఎందుకంటే దేశంలో చివరిసారిగా 2011లోనే జనాభా లెక్కలు నిర్వహించారు. 2024 ఎన్నికల తర్వాత జనాభా లెక్కలు చేపడతారని అంటున్నారు.

జనాభా లెక్కలు తేలితే కానీ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) సాధ్యం కాదు. జనాభా లెక్కలన్నీ తేలడానికి నాలుగేళ్ల సమయం పడుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో 2029 ఎన్నికల తర్వాతే డీలిమిటేషన్‌ ఉంటుందని అంటున్నారు. చివరిసారిగా 2009 ఎన్నికలకు ముందు నియోజకవర్గాలను పునర్విభజించారు. అయితే సంఖ్యను పెంచలేదు. ఉన్న నియోజకవర్గాల సరిహద్దులు, పేర్లు మారాయి. కొన్ని రద్దయ్యాయి. వాటి స్థానం కొత్త పేర్లతో కొత్త నియోజకవర్గాలు వచ్చాయి. సంఖ్య అంతకుముందు మాదిరిగానే ఉంది.

కొత్త జనాభా లెక్కల ఆధారంగా మహిళల జనాభా ఎంతో తేలనుంది. అలాగే దేశంలో ఏ లోక్‌ సభా నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళలు ఎక్కువ మంది ఉన్నారో తెలుస్తోంది. మహిళలు ఎక్కువ ఉన్న నియోజకవర్గాలను 33 శాతం రిజర్వేషన్లు ప్రకారం వారికి కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును కేంద్రం ఆమోదించినా 2024 ఎన్నికల్లో దాన్ని అమలు చేయడం సాధ్యం కావడం లేదు.

కొత్త జనాభా లెక్కల ప్రకారం.. కొన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో జనాభా పెరిగే అవకాశం ఉంది. అలాగే మరికొన్ని రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ లెక్కన జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లు, అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. జనాభా తక్కువ ఉన్న చోట పార్లమెంటు, అసెంబ్లీ సీట్లు తగ్గిపోతాయి. అలాగే మహిళలు, పురుషుల జనాభాలోనూ మార్పుచేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో జనాభా లెక్కలు తేలితే కానీ నియోజకవర్గాల పునర్విభజన సా«ధ్యం కాదు. అలాగే మహిళలకు కేటాయించే సీట్లేవో కూడా తెలియదు.

డీలిమిటేషన్‌ అనేది రాజ్యాంగబద్ధమైన కార్యక్రమం. రాజ్యాంగంలోని 82వ అధికరణం ప్రకారం దీనిని చేపడతారని నిపుణులు చెబుతున్నారు. ప్రతి పదేళ్లకోసారి జరిగే జనగణన (జనాభా లెక్కలు) తర్వాత ఇది జరగాల్సి ఉంటుంది. డీలిమిటేషన్‌ చట్టం ప్రకారం... కేంద్ర ప్రభుత్వం ఓ కమిషన్‌ ను ఏర్పాటు చేస్తుంది. దీనికి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల జనాభా గణాంకాలను కమిషన్‌ సేకరిస్తుంది. ఆ తర్వాత వాటిని అధ్యయనం చేసి తన ప్రాథమిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి కనీసం ఐదేళ్ల సమయం పడుతుంది.

కమిషన్‌ ఇచ్చిన నివేదికను గెజిట్‌ లో ప్రచురించి అభ్యంతరాలను స్వీకరిస్తారు. వాటినీ పరిశీలించాక తుది నివేదిక సమర్పిస్తారు. ఒక్కసారి డీలిమిటేషన్‌ కమిషన్‌ తుది నివేదిక ప్రచురించిందంటే దానిని పార్లమెంటు కూడా మార్చలేదు. ఏ కోర్టులోనూ సవాలు చేయడానికి కూడా వీలు లేదు. డీలిమిటేషన్‌ కమిషన్‌ ఏది చెబితే అది చట్టం అవుతుంది.

దేశంలో మొదటి డీలిమిటేషన్‌ ప్రక్రియ 1952లో జరిగింది. తద్వారా అప్పటి జనాభా ఆధారంగా లోక్‌ సభకు 494 నియోజకవర్గాలుగా నిర్ణయించారు. ఇక 1963లో రెండో డీలిమిటేషన్‌ కమిషన్‌ ఈ సంఖ్యను 522కు పెంచింది. 1973లో లోక్‌సభ సీట్లు 543కు పెరిగాయి. ఆ తర్వాత జనాభా పెరిగినా మళ్లీ డీలిమిటేషన్‌ లో భాగంగా సీట్లు పెరగలేదు. దీనికి కారణం 1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్‌ ప్రక్రియను 25 ఏళ్లపాటు నిలిపేసింది. జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని రాష్ట్రాలు సమర్థంగా నిర్వహించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇక 2001లో అప్పటి అటల్‌ బిహారి వాజ్‌పేయీ సర్కారు అదే కారణం చెబుతూ మరో పాతికేళ్ల దాకా అంటే 2026 దాకా డీలిమిటేషన్‌ కు లేకుండా నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో 2029 తర్వాతే కొత్త నియోజకవర్గాలతోపాటు మహిళలకు రిజర్వేషన్లు అమల్లోకి రావొచ్చని తెలుస్తోంది. మారిన జనాభా ప్రకారం.. పార్లమెంటులో లోక్‌ సభ సీట్లు ప్రస్తుతమున్న 543 నుంచి 888 దాకా... రాజ్యసభ సీట్లు ప్రస్తుతం ఉన్న 245 నుంచి 384కు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇదే రీతిలో జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాల్లో సీట్లు తగ్గిపోతాయి.

Tags:    

Similar News