పెద్దిరెడ్డికి భారీ దెబ్బ.. మురళి ఎఫెక్ట్ బాగానే పడిందే.. !
వైసీపీ మాజీ మంత్రి, కీలక నాయకుడు, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ దెబ్బ తగిలిందన్న ప్రచారం జరుగుతోంది.
వైసీపీ మాజీ మంత్రి, కీలక నాయకుడు, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ దెబ్బ తగిలిందన్న ప్రచారం జరుగుతోంది. ఆయనకు బినామీగా ఉన్నట్టుగా రాజకీయాల్లో చర్చ సాగుతున్న డిప్యూటీ కలెక్టర్(ఆర్‌డీవో) మురళిని ప్రభుత్వం తాజాగా సస్పెండ్ చేసింది. ఇదేమీ చిన్న విషయం.. సాధారణ అంశం కానేకాదు. చాలా పెద్ద ఎత్తున అభియోగాలు ఎదుర్కొంటున్న మురళిని ప్రభుత్వం పక్కన పెట్టడం, ఆయనపై ఏసీబీ, సీఐడీ దర్యాప్తు సాగుతుండడం గమనార్హం.
ఎన్నికల అనంతరం.. కొన్ని రోజులకే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో ఉన్న డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీనిలో కీలకమైన పత్రాలు కాలిపోయాయని అప్పట్లో సర్కారు చెప్పింది. అంతేకాదు.. ఈ పత్రాల్లో పెద్ది రెడ్డి సతీమణికి సంబంధించి కేటాయించిన భూముల పత్రాలు కూడా ఉన్నాయని వార్తలు వచ్చాయి. వీటిపై విచారణ సాగుతోంది. అయితే.. దీనివెనుక పెద్దిరెడ్డికి బినామీగా ఉన్న మురళిని కార్నర్ చేశారు.
ఆయనపై విచారణ సాగుతోంది. మరోవైపు.. మురళిపై ఏసీబీ(యాంటీ కరెప్షన్ బ్యూరో) కూడా పంజా విసిరింది. ఆయన ఇళ్లు, కార్యాలయం, ఇతర కుటుంబ సభ్యుల ఇళ్లపైనా ఏకకాలంలో దాడులు చేసింది. దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగానే ఆస్తులు ఉన్నాయని గుర్తించారు. అయితే.. వీటిలో కొన్ని పెద్దిరెడ్డి బినామీగా మురళి వ్యవహరించినట్టు గుర్తించడం సంచలనంగా మారింది. పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలోనే మురళి డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందడం.. గమనార్హం.
ఈ మొత్తం ఎపిసోడ్‌లో పెద్దిరెడ్డిని కాపాడేందుకు.. మురళి అన్ని విధాలా సహకరించినట్టు అధికారులు తేల్చినట్టు తెలిసింది. అంటే.. జీవో 127 ద్వారా.. అసైన్డ్ భూములను తొలగించి.. పట్టాలు జారీ చేయడం.. వీటిని తన సతీమణి పేరుతో పెట్టడం వంటివిషయాల్లో పెద్దిరెడ్డికి మురళి సహకరించారన్నది అభియో గం. అదేవిదంగా కొన్ని ఆస్తులకు ఆయన బినామీగా ఉన్నట్టు కూడా లెక్కలు వేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే పెద్దిరెడ్డికి- మురళికి మధ్య లావాదేవీలు జరిగి ఉంటాయని అనుమానిస్తున్నారు. దీంతో ప్రబుత్వం ఆయనను సస్పెండ్ చేసి.. పూర్తిస్థాయి విచారణకు ఆదేశించడంతో పెద్దిరెడ్డికి భారీ ఎదురు దెబ్బ ఖాయమన్న చర్చ సాగుతుండడం గమనార్హం.