భీమిలీ నా అడ్డా అంటున్న గుడివాడ ?

టీడీపీ ఓడిన ప్రతీసారి అతి తక్కువ ఓట్ల తేడాతో గెలిచిన ప్రతీ సారి అత్యంత భారీ మెజారిటీతో జరుగుతూ వస్తోంది. 2024 ఎన్నికల్లో కూడా భీమిలీలో టీడీపీ మెజారిటీ డెబ్బై వేలు దాటింది.

Update: 2024-12-22 07:00 GMT

భీమునిపట్నం నియోజకవర్గం విశాఖలో చాలా ముఖ్యమైనది. ఈ సీటు టీడీపీ పుట్టాక ఆ పార్టీకి కంచుకోటగా మారింది. మొత్తం ఇప్పటిదాకా పది సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే ఏడు సార్లు టీడీపీయే గెలిచింది అంటే ఎంతటి కీలకమైన సీటు అన్నది అర్ధం అవుతుంది. టీడీపీ ఓడిన ప్రతీసారి అతి తక్కువ ఓట్ల తేడాతో గెలిచిన ప్రతీ సారి అత్యంత భారీ మెజారిటీతో జరుగుతూ వస్తోంది. 2024 ఎన్నికల్లో కూడా భీమిలీలో టీడీపీ మెజారిటీ డెబ్బై వేలు దాటింది.

జగన్ వేవ్ బలంగా వీచిన 2019లో ఆ పార్టీ తరఫున అవంతి శ్రీనివాస్ గెలిచింది తొమ్మిది వేల ఓట్ల తేడాతోనే. అంతలా కంచుకోటగా భీమిలీ ఉండబట్టే ఆ సీటు టీడీపీకి ప్రతిష్టాత్మకమైనది. అయితే వైసీపీ మొత్తం మూడు సార్లు పోటీ చేస్తే రెండు సార్లు పెద్ద తేడాతో ఓడింది. 2024లో అయితే 40 వేల పై చిలుకు ఓట్ల తేడాతో గంటా ఓడించారు. ఇపుడు అదే గంటా డెబ్బై వేల బెంచ్ మార్క్ ని ఫిక్స్ చేశారు

ఇవన్నీ తెలిసే అవంతి శ్రీనివాస్ వైసీపీలో ఉంటే గెలవడం కష్టమని భావించి పార్టీని వీడారు అని అంటారు. అయితే భీమిలీ సీటు విషయంలో వైసీపీ హై కమాండ్ కి అయితే ఏమీ తోచడం లేదు. నియోజకవర్గాన్ని లీడ్ చేసే స్థాయి నేతలు లేరు అని అంటున్నారు. ఇక అంగబలం అర్ధబలం రెండూ ఉండి టీడీపీ కంచుకోటలో గట్టిగా పోరాడాల్సిన పరిస్థితి ఉంది.

దాంతో హైకమాండ్ అయితే ఎవరినీ ఇంచార్జిగా వేయలేదు. అయితే అవంతి శ్రీనివాస్ ఇలా రాజీనామా చేయగానే అలా జిల్లా అధ్యక్షుడు హోదాలో గుడివాడ అమర్నాథ్ మీటింగ్ పెట్టారు. భీమిలీ వైసీపీ నేతలను పిలిచి పార్టీని బలోపేతం చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. దీంతో గుడివాడ కన్ను భీమిలీ మీద పడింది అని అంటున్నారు.

ఇక గుడివాడ విషయానికి వస్తే ఆయనకంటూ ఒక పర్మనెంట్ సీటు అయితే లేదు. 2014లో ఆయన తన సొంత నియోజకవర్గం అయిన గాజువాక అడిగితే అనకాపల్లి ఎంపీగా పార్టీ పంపించింది. ఆయన పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. అలాగే 2019లో అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలిచి మంత్రి అయ్యారు. కానీ నాన్ లోకల్ అన్న కార్డుని స్థానిక నేతలు తీయడంతో పాటు మంత్రిగా ఉన్నపుడు ఆయన పెద్దగా ఏమీ చేయలేదన్న వ్యతిరేకత నేపధ్యంలో గాజువాకకు షిఫ్ట్ చేశారు.

అయితే గాజువాకలో చివరి నిముషంలో రావడంతో పాటు జనసేన ప్లస్ టీడీపీ బలంగా ఉండడంతో ఆయన ఓటమి పాలు అయ్యారు. పైగా సొంత పార్టీ నేతలు కూడా హ్యాండ్ ఇచ్చారని కూడా టాక్ నడచింది. ఇపుడు చూస్తే 2019 ఎన్నికలలో పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు రెడీ అవుతున్నారు. దాంతో గాజువాక కంటే బెటర్ సీటు ఏదీ అని గుడివాడ ఆలోచిస్తున్న క్రమంలో అవంతి శ్రీనివాస్ రాజీనామా ఆయనకు కలిసి వచ్చింది అని అంటున్నారు.

దాంతో గాజువాక టూ భీమిలీకి షిఫ్ట్ అయ్యేందుకు గుడివాడ చూస్తున్నారు అని అంటున్నారు. దానికి కారణం ఆయన సొంత సామాజిక వర్గం అక్కడ హెచ్చు సంఖ్యలో ఉన్నారు. గతంలో ఆయన తండ్రి పెందుర్తి ఎమ్మెల్యేగా చేసినపుడు అందులోని కొన్ని ప్రాంతాలు పునర్ విభజనలో భీమిలీలో కలిశాయి. అలా తన తండ్రి పలుకుబడి కూడా అనుకూలిస్తుందని గుడివాడ భావిస్తున్నారు

ఇప్పటి నుంచే నియోజకవర్గంలో ఉంటూ పటిష్టం చేసుకుంటే 2029 నాటికి పోటీ చేసి గెలవవచ్చు అన్నది ఆయన ఆలోచనగా ఉంది అని అంటున్నారు. ఇక భీమిలీ అంటే పెద్దగా పార్టీ నుంచి ఎవరూ పోటీ పడేది లేదు అని అంటున్నారు. వైసీపీ హైకమాండ్ కూడా గుడివాడ రెడీ అంటే ఓకే అని అంటుందని చెబుతున్నారు. అయితే భీమిలీలో టీడీపీ మీద నెగ్గడం అంత ఈజీ కాదని అంటున్నారు. టీడీపీకి పట్టుంది, జనసేన పొత్తు ఉంది, మరి గుడివాడ గట్టిగా కష్టపడితేనే తప్ప ఫలితం దక్కదని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. గుడివాడ మనసు పడ్డ భీమిలీ ఆయనకు ఏ రకంగా సక్సెస్ అందిస్తుందో అన్నది.

Tags:    

Similar News