కేసీఆర్ పై నారాయణ స్వామి షాకింగ్ కామెంట్లు
ఏపీలో రోడ్ల దుస్థితి గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో పలుమార్లు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
ఏపీలో రోడ్ల దుస్థితి గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో పలుమార్లు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. రోడ్లపై గుంతలు, సింగిల్ రోడ్ల వ్యవహారంపై పవన్ నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ క్రమంలోనే ఏపీలో రోడ్లపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. సింగిల్ రోడ్డు కనిపిస్తే ఏపీ అని, డబుల్ రోడ్డు కనిపిస్తే తెలంగాణ అని కేసీఆర్ చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పందించారు.
ఎన్నికల స్టంట్‌లో భాగంగానే ఏపీ రోడ్ల గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారని నారాయణ స్వామి విమర్శించారు. రెండు రోడ్లు, ఒక రోడ్డు అని మాట్లాడటం ఏంటని నిలదీశారు. తెలంగాణాలో కమ్మ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు, సెటిలర్స్ ఓట్ల కోసమే ఏపీ ప్రభుత్వంపై ఇష్టారీతిన కేసీఆర్ కామెంట్లు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కేసీఆర్ మనసులో ఏముందో చెప్పాలని నిలదీశారు. నవరత్నాల పథకాలతో ఏపీ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్న విషయం కేసీఆర్‌కు తెలుసా? అని ప్రశ్నించారు.
పొరుగు రాష్ట్రం ఏపీని చూస్తే తెలంగాణ అభివృద్ధి కనిపిస్తుందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నారాయణ స్వామి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో వెలుగులు, ఏపీలో చీకట్లు.. తెలంగాణ డబుల్ రోడ్లు, ఏపీలో సింగిల్ రోడ్లు అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో నారాయణ స్వామి, వైసీపీ నేతలు ప్రతి విమర్శలకు దిగారు. మరి నారాయణస్వామి వ్యాఖ్యలపై కేసీఆర్, బీఆర్ఎస్ నేతల కౌంటర్ ఏ విధంగా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.