90 ఏళ్ల దేవెగౌడ.. ఆయన ప్రధానిగా ఉండగానే మహిళా బిల్లు

మళ్లీ ఇన్నాళ్లకు..27 ఏళ్లుగా ఆమోదానికి నోచుకోని మహిళా బిల్లు.. 13 ఏళ్ల కిందటే రాజ్య సభ ఆమోదం పొందిన బిల్లు

Update: 2023-09-19 07:57 GMT

భారత రాజకీయాల్లో అత్యంత వయసున్న నాయకుడు ఆయన. రాష్ట్ర స్థాయి నేతగా ఉన్న ఆయన అనూహ్యంగా దేశ ప్రధాని అయ్యారు. ఈ హోదాలో కేవలం పది నెలలు మాత్రమే కొనసాగారు. అందులోనూ చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. బహిరంగ సభలు, కార్యక్రమాల సందర్భంగా ‘కునుకు’ తీస్తారనే అపనిందను ఎదుర్కొన్నారు.

ఆయన హయాంలోనే..హరదనహళ్ళి దొడ్డేగౌడ దేవేగౌడ.. బహుశా ఈ పూర్తి పేరుతో పిలిస్తే ప్రస్తుత తరంలో ఎవరికీ తెలియదేమో. దేవెగౌడ అంటే కాస్త గుర్తుపట్టే వీలుంది. ఎందుకుంటే దేవెగౌడ ఓల్డెస్ట్ ఇండియన్ లీడర్. దేశానికి 11వ ప్రధానిగా 1996 జూన్ 1 నుంచి 1997 ఏప్రిల్ 21 వరకు సేవలందించారాయన. 1994-1996 మధ్య కర్నాటకకు 14వ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం 90 ఏళ్లున్న దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడే.. అంటే 1996లో మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అలా ఆయన ఓ ప్రత్యేక బిల్లుకు సాక్షిగా నిలిచారు.

మళ్లీ ఇన్నాళ్లకు..27 ఏళ్లుగా ఆమోదానికి నోచుకోని మహిళా బిల్లు.. 13 ఏళ్ల కిందటే రాజ్య సభ ఆమోదం పొందిన బిల్లు.. మళ్లీ ఇన్నాళ్లకు తెరపైకి వచ్చింది. ప్రస్తుత పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టే వీలుందని తెలుస్తోంది. కాగా, ఈసారి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు ప్రభుత్వం ఎజెండా ఇదీ అంటూ ఏదీ నిర్దిష్టంగా చెప్పలేదని.. అనూహ్య బిల్లులు తెరపైకి రావొచ్చని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనుమానం వ్యక్తం చేసింది. దీనికితగ్గట్లే ప్రభుత్వం అనూహ్యంగా మహిళా బిల్లును తీసుకురానున్నట్లు లీకులిచ్చింది.

అఖిలపక్షంలో డిమాండ్ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు ముందు ప్రభుత్వం ఆనవాయితీ ప్రకారం అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. ఆదివారం జరిగిన ఈ సమావేశంలో ప్రతిపక్షాలు మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని ముక్తకంఠంతో డిమాండ్ చేయడం గమనార్హం. కాగా, ఈ సమావేశాల్లో మాజీ ప్రధాని దేవెగౌడ సైతం పాల్గొన్నారు. అలా.. తాను ప్రధానిగా ఉన్నప్పుడు తొలిసారి పార్లమెంటులోకి వచ్చిన బిల్లుకు 90 ఏళ్ల వయసులో ఆయన ప్రధాన సాక్షిగా నిలిచారు. ఈ సమావేశాల్లో దేవెగౌడ మహిళా బిల్లు గురించి ప్రస్తావించినదీ లేనిదీ తెలియనప్పటికీ ఆయన పాల్గొనడం మాత్రం యాక్సిడెంటల్ అనే చెప్పాలి.

రాజకీయ గండరగండడు వాస్తవానికి జనతాదళ్ ను చీల్చి జేడీ (సెక్యులర్) పేరిట సొంత కుంపటి పెట్టిన దేవెగౌడ.. తాను సీఎం కాలేక కుమారుడు కుమారస్వామిని సీఎం చేశారు. కర్ణాటక రాజకీయాలపై ఆయనకు మంచి పట్టున్నప్పటికీ. ఇటీవలి ఎన్నికల్లో జేడీఎస్ దారుణంగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలోనే దేవెగౌడ సెక్యులర్ ముద్రను వదిలించుకుని బీజేపీతో జట్టు కట్టేందుకు సిద్ధం అవుతున్నారు. గతంలోనూ బీజేపీతో జట్టుకట్టి ఆ పార్టీకి ఝలక్ ఇచ్చిన చరిత్ర జేడీఎస్ ది కావడం గమనార్హం.

Tags:    

Similar News