విదేశీ విమాన సంస్థలకు భారత్ 10 వేల కోట్ల నోటీసులు... నోరెళ్లబెట్టిన ఐఏటీఏ!
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) ఇటీవల పలు బడా సంస్థలకు పన్ను ఎగవేత నోటీసులు జారీ చేసినట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) ఇటీవల పలు బడా సంస్థలకు పన్ను ఎగవేత నోటీసులు జారీ చేసినట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా దేశీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు విదేశీ విమానయాన సంస్థలకూ.. డీజీజీఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది.
అవును.. దేశీయంగా కార్యక్రలాపాలు నిర్వహిస్తున్న పలు విదేశీ ఎయిర్ లైన్స్ సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా రూ.10వేల కోట్ల పన్ను ఎగవేశారని ఆరోపించింది. ఈ మేరకు పది విమానయాన సంస్థలకు నొటీసులు పంపినట్లు తెలుస్తోంది. దీంతో ఈ నోటీసులపై ఐఏటీఏ స్పందించింది.
డీజీజీఐ నోటీసులు పంపిన వాటిలో ప్రధానంగా బ్రిటిష్ ఎయిర్ వేస్, ఎమిరేట్స్, ఒమన్ ఎయిర్, లుఫాన్సా, సింగపూర్ ఎయిర్ లైన్స్ వంటి పలు సంస్థలున్నాయి. దీంతో... ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ సందర్భంగా స్పందించిన ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్... ఈ నోటీసులు తమను తీవ్ర నిరాశకు గురిచేసినట్లు పేర్కొంది.
అసలు ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇలాంటి విధానం లేదని వెల్లడించింది. అంతర్జాతీయంగా సేవలందిస్తున్న భారతదేశానికి చెందిన విమానయాన సంస్థలు కూడా ఇలాంటి ట్యాక్స్ డిమాండ్లు అందడంలేదని తెలిపింది. ఇదే సమయంలో ఈ వ్యవహారంపై పరిష్కారం చూపించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
మరోపక్క 2017-2024 మార్చి మధ్య తమ భారత శాఖల్లో పొందిన సేవలకు సంబంధించి ఈ ట్యాక్సులు చెల్లించడంలో ఆయా కంపెనీలు విఫలమైన నేపథ్యంలోనే ఈ నోటీసులు పంపిస్తున్నట్లు సబంధిత వర్గాలు పేర్కొన్నాయని తెలుస్తోంది. ఇదే క్రమంలో... దేశీయంగా ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్, సిబ్బంది వేతనాలు, అద్దెలు వంటివి విమాన సర్వీసులు నిర్వహించే సంస్థలు చెల్లిస్తుంటాయని చెబుతున్నారు!
అలా ఓ సంస్థ నుంచి మరో సంస్థకు చేసే చెల్లింపులు జీఎస్టీకి లోబడి ఉంటాయని.. అందువల్ల ఆయా సంస్థలు భారత్ లో జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు పెర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే... ఇవి తమకు మాత్రం వర్తించవనేది విమానయాన సంస్థల వాదంగా ఉంది!