"నా కుమార్తెను, అల్లుడిని ప్రాణహిత నదిలో తోసెయ్యండి"
రాజకీయాల్లో శాస్వత శత్రువులు, శాస్వత మిత్రులు ఉండరంటారనే సంగతి తెలిసిందే..
రాజకీయాల్లో శాస్వత శత్రువులు, శాస్వత మిత్రులు ఉండరంటారనే సంగతి తెలిసిందే.. ఇదే సమయంలో ఆ శత్రువుల విషయంలో కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు అనే తారతమ్యాలు కూడా ఉండవు అనేందుకు పలు ఉదాహరణలు తెరపైకి వచ్చాయి! ఈ క్రమంలో తాజాగా తన కుమార్తె, అల్లుడుపై ఓ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అవును... తన కుమార్తె, తన అల్లుడు పార్టీ మారొచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వారు నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నారు.. వారిద్దరినీ ప్రాణహిత నదిలో తోసెయాలంటూ మహారాష్ట్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అహేరీ అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రజలతో మాట్లాడుతున్న సందర్భంగా ఈ విధంగా స్పందించారు.
వివరాళ్లోకి వెళ్తే... సీనియర్ ఎన్.సీ.పీ నెత ధర్మారావ్ బాబా ఆత్రాం కుమార్తె భాగ్యశ్రీ, అల్లుడు రితురాజ్ హోల్గెకర్ లు శరద్ పవార్ వర్గం ఎన్.సీ.పీలో చేరొచ్చంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది! ఈ విషయంపై తాజాగా స్పందించిన ధర్మారావ్ బాబా... పార్టీలు వీడి కొందరు వెళ్తుంటారు.. వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.
అనంతరం... తన రాజకీయ పలుకుబడిని ఉపయోగిచుకుని తన కుటుంబంలో కొంతమంది మరో పార్టీలో చేరాలని అనుకుంటున్నారని అన్నారు. ఈ సమయంలో... శరద్ పవార్ గ్రూపు నేతలు తమ ఇంటిని ముక్కలు చేసి, తనపై తన కుమార్తెనే పోటీకి నిలబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో... తన కుమార్తెను, అల్లుడిని కూడా నమ్మొద్దని మంత్రి వ్యాఖ్యానించారు.
అక్కడితో ఆగని ఆయన... తన కుమార్తె, అల్లుడు తనను వదిలేశారని.. వారు నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని.. వారిని ప్రాణహిత నదిలో తోసెయ్యండని ప్రజలకు పిలుపునిచ్చారు! ఓ తండ్రికి కుమార్తెగా ఉండలేకపోయిన ఆ అమ్మాయి.. ప్రజల వ్యక్తి ఎలా అవుతుంది.. ఎలాంటి న్యాయం చేస్తుంది.. అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర వివదాస్పదమవుతున్నాయి.
కాగా... మహారాష్ట్రలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... ప్రధానంగా ఎన్సీపీ – శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) మధ్య రాజకీయ వాతావరణం వేడేక్కింది. గత ఏడాది ఎన్సీపీ నుంచి చీలిపోయిన మెజారిటీ ఎమెల్యేలతో కలిసి బీజేపీ-శిండే ప్రభుత్వానికి మద్దతు పలికిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
ఈ సమయంలో ఆయన వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ... ఎన్సీపీ - ఎన్సీపీ (ఎస్పీ) నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని అంటున్నారు. మంత్రి ధర్మారావ్ బాబా ఘాటు వ్యాఖ్యలకూ అదే కారణం అని అంటున్నారు!