'ధరణి' పోయి 'భూమాత' వచ్చే ఢాం.. ఢాం.. ఢాం
పింఛన్‌ను ఏటా రూ.500 చొప్పున పెంచుకుంటూ పోతామని, ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని, దళిత బంధును అన్ని నియోజకవర్గాల్లోనూ అమలు చేస్తామని ప్రకటించింది
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృత ప్రచారంలో ఉన్న బీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఇక, మేనిఫెస్టోను వండి వార్చడంపై దృష్టి పెట్టాయి. ఇప్పటికే బీఆర్ ఎస్ కొన్ని హామీలు ప్రకటించింది. పింఛన్‌ను ఏటా రూ.500 చొప్పున పెంచుకుంటూ పోతామని, ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని, దళిత బంధును అన్ని నియోజకవర్గాల్లోనూ అమలు చేస్తామని ప్రకటించింది. అయితే.. పూర్తిస్థాయి మేనిఫెస్టోను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
ఇక, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఉధృత ప్రచారం చేస్తూనే.. మరోవైపు మేనిఫెస్టోపైనా దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ పార్టీ కూడా ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. దీనిలో ప్రధానంగా వంట గ్యాస్, మహిళా సాధికారత పేరిట బస్సుల్లో ఉచిత ప్రయాణాలు ఉన్నాయి. ఇక, ఇప్పుడు మరికొన్ని హామీలపై లీకులు ఇచ్చింది. వీటిలో ఆది నుంచి కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్న ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్‌ను తీసుకురానున్నట్టు ప్రకటించింది.
ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్.. పారదర్శకంగా ఉద్యోగాల నియామాలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించనుం ది. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఉచితంగా ఇంటర్నెట్ ఇవ్వనున్నట్టు ప్రకటించనుంది. పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన కార్యక్రమంలో పాల్గొంటున్న కార్మికులకు నెలకు ఇప్పుడున్న మూడు వేల రూపాయల వేతనాన్ని రూ.10 వేలకు పెంచనున్నట్టు కాంగ్రెస్ పేర్కొంది.
రాష్ట్రంలో మూతబడిన ప్రభుత్వ పాఠశాలలను తిరిగి తెరిపించే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందని.. అదేవిధంగా రాష్ట్రంలో కొత్త 4 ఐఐటీలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రతిపాదిత మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొంది. ఆరోగ్య శ్రీ పరిధిలో చికిత్సలు అందిస్తున్న వాటిలోతాము అధికారంలోకి వస్తే.. మోకాలి శస్త్ర చికిత్సను, మోకీలు మార్పిడిని చేర్చనున్నట్టు కాంగ్రెస్ తెలిపింది. గ్రామాల అభివృధ్ధి నిధులను నేరుగా సర్పంచుల ఖాతాల్లోనే జమ చేయనున్నట్టు ప్రతిపాదిత మేనిఫెస్టోలో స్పష్టం చేసింది.