డోన్ లో ఢీ : కోట్ల వర్సెస్ బుగ్గన !
కర్నూల్ జిల్లాలో కీలకమైన నియోజకవర్గంగా డోన్ ని చెప్పుకోవాలి. రాజకీయంగా విశేషంగా ప్రభావితం చేసే నేతలు ఇక్కడ నుంచి పోటీ చేశారు.
కర్నూల్ జిల్లాలో కీలకమైన నియోజకవర్గంగా డోన్ ని చెప్పుకోవాలి. రాజకీయంగా విశేషంగా ప్రభావితం చేసే నేతలు ఇక్కడ నుంచి పోటీ చేశారు. 1978 నుంచి చూస్తే ఈ నియోజకవర్గం కోట్ల కేఈ కుటుంబాల మధ్య నలుగుతోంది. మాజీ మంత్రి దిగ్గజ నేత కేఈ క్రిష్ణమూర్తి కాంగ్రెస్ నుంచి మొదటి సారి 1978 లో డోన్ లో గెలిచారు. 1983లో కూడా ఎన్టీఆర్ వేవ్ ని తట్టుకుని ఆయన గెలిచారు. 1985లోనూ ఆయనదే విజయం. ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు.
అదే విధంగా చూస్తే 1998లో కేఈ గెలిస్తే 1994లో మాజీ ముఖ్యమంత్రి కర్నూల్ పెద్దాయన కోట్ల విజయభాస్కరరెడ్డి గెలిచారు. 1999లో కేఈ ప్రభాకర్ ఎమ్మెల్యే అయ్యారు. 2004లో కోట్ల విజయభాస్కరరెడ్డి కోడలు కోట్ల సుజాతమ్మ గెలిచారు
ఇక 2009లో కేఈ క్రిష్ణ మూర్తి గెలిచారు. 2014 నుంచి వరసగా రెండు సార్లు బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి గెలిచారు. ఈసారి కూడా ఆయనే వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూల్ ఎంపీ సీటు కోరితే ఆయనకు డోన్ టికెట్ ని టీడీపీ ఇచ్చింది.
అయిష్టంగానే తాను పోటీలో ఉన్నాను అని కోట్ల విలేకరుల ముందే చెప్పారు. ఈ సీటు కోసం కేఈ కుటుంబం కూడా పట్టుబట్టింది. ఒక దశలో వైసీపీలోకి కేఈ ప్రభాకర్ వస్తారని కూడా ప్రచారం సాగింది.మొత్తానికి కేఈ వర్గం టీడీపీలో ఉన్న కోట్లకు ఎంతవరకూ సహకరిస్తారు అన్నది సందేహంగా ఉంది.
గతంలో కాంగ్రెస్ టీడీపీల లో ఉన్నపుడు కోట్ల కేఈ కుటుంబాలు ప్రత్యర్ధులు. ఇపుడు టీడీపీలో ఉన్నా కూడా రెండు కుటుంబాల మధ్యన అదే రకమైన విభేదాలు ఉన్నాయి. అంతే కాదు గతంలో కేఈ కుటుంబం డోన్ నుంచి పోటీ చేసినపుడు కోట్ల వర్గం గెలుపు కోసం సహకరించలేదు అని అన్నది కూడా ఉంది.
అంతే కాకుండా ఈ సీటు కోసం కేఈ వర్గం పోటీ పడింది. ఇపుడు కోట్లకు ఇవ్వడంతో కేఈ కుటుంబం మీదనే అందరి చూపూ ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రెండు కుటుంబాలను ఇద్దరు నేతలను కలిపినా గ్రౌండ్ లెవెల్ లో మాత్రం కలసి లేరు అనే అంటున్నారు. మరో వైపు చూస్తే ఈసారి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రావు గెలిస్తే కనుక చంద్రబాబు మంత్రివర్గంలో తప్పకుండా సీటు లభిస్తుందని అంటున్నారు.
దాంతో ఒక్కసారిగా కోట్ల ఫ్యామిలీ ప్రభ వెలిగిపోవడం జిల్లాలో రాజకీయం ఆ వైపు మళ్ళడం ఖాయం. మరి ఈ నేపధ్యంలో కోట్లకు కేఈ వర్గం సపోర్టు అవసరం మనస్పూర్తిగా చేస్తేనే కోట్ల గెలుపు సాధ్యం అని అంటున్నారు. ఇక వైసీపీ నుంచి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి హ్యాట్రిక్ కోసం చూస్తున్నారు. టీడీపీ వర్గ పోరు ఏమైనా ఆయనకు హెల్ప్ అవుతుందా అన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి కర్నూల్ లో ఆకట్టుకునే సీట్లలో డోన్ ఒకటి అని అంటున్నారు.