బాబు హైకమాండ్ ఎవరో తెలుసా ?
అయితే ఎంతటి అధినేత అయినా తన పార్టీ వారితో కలసి కూర్చుకుని నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది.
హైకమాండ్ అన్నది రాజకీయ పార్టీలకు ఉంటుంది. కాంగ్రెస్ బీజేపీలలో ఢిల్లీలో ఉంటుంది. ఇక ప్రాంతీయ పార్టీలకు ఆయా రాష్ట్రాలలో ఉంటుంది. హైకమాండ్ అంటే అధినేత అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎంతటి అధినేత అయినా తన పార్టీ వారితో కలసి కూర్చుకుని నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. అపుడే అది సమిష్టి బాధ్యత అనిపించుకుంటుంది.
అంతే కాదు ఆ నిర్ణయాలు కూడా ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసేలా ప్రజా కోణంలో ఉండాలి. రాజకీయాల్లో అర్ధ శతాబ్దం పాటు తలపండిన చంద్రబాబుకు ఇవన్నీ తెలియనివి కాదు. అందుకే ఆయన పల్నాడు జిల్లా యల్లమందలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ తనకు హై కమాండ్ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పింది నిజమే బాబుకు ఎవరూ హై కమాండ్ లేరు. ఆయనే టీడీపీకి సుప్రీం.
అయితే బాబు అంతటితో ఆగిపోలేదు. కానీ తనకూ ఒక హై కమాండ్ ఉంది అని అన్నారు. ఆ హై కమాండ్ అయిదు కోట్ల ప్రజలు అని ఆయన స్పష్టం చేశారు. అంటే ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తే వారు ఏమి కోరుకుంటే ఆ విధంగా చేయడానికి తాను రెడీగా ఉన్నాను అని చెప్పడం ద్వారా బాబు తన రాజకీయ పంధా ఏమిటో చక్కగా చెప్పారు.
నేను ప్రజల కోసం రాజకీయం చేస్తున్నాను, ముఖ్యంగా పేద ప్రజల కోసమే నా తపన అని బాబు అన్నారు. పేదలు బాగుపడాలన్నదే తన కోరిక అంటూ వారు ఏమి కోరుకుంటున్నారో గమనించి దానికి అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని బాబు చెప్పారు.
తాను ప్రజా పాలన అందిస్తాను అని ఆయన అంటున్నారు. ఇక ఏపీలో గత అయిదేళ్లలో జరిగినంత విద్వంశం ఎక్కడా చూడలేదని ఏపీ నుంచి పరిశ్రమలు అన్నీ పారిపోయాయని కూడా ఆయన చెప్పారు. ఇపుడు వాటిని ఏపీకి తమ ప్రభుత్వం రప్పిస్తోంది అని ఆయన చెప్పారు.
ఏపీని గాటిలో పెట్టేందుకు తమ ప్రభుత్వం శక్తివంచన లేకుండా పనిచేస్తోందని బాబు అన్నారు. ఏపీలో అభివృద్ధిని సంక్షేమాన్ని కలపి అనుసంధానం చేస్తూ ముందుకు సాగుతున్నామని బాబు చెప్పారు అదే విధంగా నదుల అను సంధానం కూడా ఏపీకి అతి ముఖ్యమని ఆ విధంగా కూడా కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఏపీ ప్రగతికి బాటలు వేస్తామని బాబు చెప్పారు. వైసీపీ పాలన ఒక పీడ కల అన్న బాబు దాని నుంచి ప్రజలను బయటకు తెచ్చి ఏపీని అన్ని విధాలుగా అగ్ర స్థానంలో నిలబెట్టేందుకే కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని బాబు చెప్పారు. మొత్తానికి బాబు తనకు హై కమాండ్ ప్రజలే అంటూ వారికి పెద్ద పీట వేయడం మాత్రం వైరల్ అవుతోంది.