అయోధ్యతో 80 శాతం ఎలక్షన్ బీజేపీ చేసేసిందా...!?
రాముడు ఒక నాడు నడయాడిన నేల అన్న గట్టి భావం ప్రతీ హిందువులో ఉంది.
ఒక్క అయోధ్య. ఒక్కడే రాముడు. ఒక్కటే బాణం ఆయనకు. అలాగే ఒక్కటే మాట ఆయనిది. యుగాలకు కాలాలకు అతీతమైన దైవం శ్రీరాముడు. ఆయన చుట్టూ ఒక్క పార్టీనే తిరుగుతూ ఉంది. అదే బీజేపీ. రాముడు అంటే అందరికీ ఇష్టమే. అయోధ్య అంటే పవిత్రమైన ప్రదేశంగా హిందువులు భక్తి ప్రపత్తులతో కొలుస్తారు. రాముడు ఒక నాడు నడయాడిన నేల అన్న గట్టి భావం ప్రతీ హిందువులో ఉంది.
రామరాజ్యం రావాలని అంతా కోరుకుంటారు. అలాంటి శ్రీరాముడికి గుడి లేదు. అయిదు వందల ఏళ్ల క్రితం నుంచి ఆ వివాదం ఉంది. దాన్ని అధిగమించి ఎట్టకేలకు 2024 జనవరి 22న రాముల వారి భవ్యమైన ఆలయం అయోధ్యలో ఏర్పాటు అయింది. అక్కడ బాల రాముడి విగ్రహానికి అభిజిత్ లగ్నంలో ప్రాణ ప్రతిష్ట జరిగింది.
ఇక మీదట రాముల వారు అయోధ్యలో అద్భుతమైన ఆలయంలో కనిపిస్తారు. ఇది హిందువులు అందరికీ పర్వ దినం. మరి ఇలాంటి సందర్భంలో కనిపించిన ఒకే ఒక పార్టీ బీజేపీ. రామ జపం ఒక వైపు సాగుతూంటే మోడీ కూడా అలాగే కనిపించారు. ఆయన దేశానికి ప్రధాని హోదాలో రాముల వారి ఆలయంలో ప్రాణ ప్రతిష్టలో పాలు పంచుకున్నారు అనుకున్నా మొత్తానికి మొత్తం ఈ కార్యక్రమం బీజేపీ హై జాక్ చేసేసింది అన్న విమర్శలు వస్తున్నాయి.
విపక్షాలు సైతం డుమ్మా కొట్టడం బీజేపీకి కలసి వచ్చింది. అయోధ్యలో రాముల వారి ఆలయ ప్రారంభం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం బీజేపీ సొంత కార్యక్రమంగా చేసిందని అంటున్నారు. ఒక విధంగా ఈ విషయంలో బీజేపీ పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని అంటున్నారు ఎక్కడ చూసిన రాముల వారి గురించి చర్చకు వస్తూంటే దానితో పాటుగా నరేంద్ర మోడీ బీజేపీ గురించి కూడా చర్చ వస్తోంది.
ఆ విధంగా జనాల మైండ్ సెట్ ని ట్యూన్ చేయడంలో బీజేపీ పూర్తిగా విజయవంతం అయింది. తిప్పు చూస్తే మరో రెండు నెలలలో ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల వేళ ఇంతటి బ్రహ్మాండమైన కార్యక్రమంలో బీజేపీ ఉండండం అంతా తానైన్ నడిపించడం దేశమంతా అయోధ్య పేరు తపిస్తున్న వేళ మరో మూడు అక్షరాలతో బీజేపీ కూడా పక్కన చేరడం వంటివి చూస్తే కనుక బీజేపీ సక్సెస్ అయింది అని ఏవైనా అంటారు.
ఈ దెబ్బతో 2024 ఎన్నికల్లో బీజేపీ తనదైన ప్రచారాన్ని ఏకంగా ఎనభై శాతానికి పైగా చేసేసింది అని అంటున్నారు దేశంలోని కోట్లాది జనం మొత్తం టీవీ సెట్లకు అతుక్కుపోయి అంతా చూశారు. మొత్తం భారత్ అంతా రామ జపంతో తరిస్తోంది. అంతా కూడా ఆ పవిత్రమైన అయోధ్యను తలచుకుని తపిస్తున్నారు.
ఈ నేపధ్యంలో బీజేపీ కూడా జనం మనసుల్లో కనిపిస్తోంది. ఒక అద్భుతమైన కార్యక్రమానికి బీజేపీ కూడా కారణం అన్న భావన జనంలోకి వెళ్ళిపోయింది. అయోధ్య వివాదాన్ని సామరస్యంగా న్యాయపరంగా పరిష్కరించడం ద్వారా బీజేపీ అయోధ్య సంస్యకు శాశ్వతమైన పరిష్కారం చూపడమే కాకుండా ఈ రోజున అయోధ్యలో భవ్యమైన ఆలయం నిర్మాణానికి కారణం అయింది అన్నది సగటు హిందువులో బలంగా నాటుకుంది.
ఆ విధంగా చేయడంలో బీజేపీ ప్లాన్ సక్సెస్ అయింది. మొత్తం మీద చూసుకుంటే ఏ విధమైన సభలు సమావేశాలు లేకుండా బీజేపీ ఒక్క అయోధ్య అంశంతో జనాలకు తాను రీచ్ అయింది అని అంటున్నారు. ఇక మిగిలిన ఇరవై శాతం ప్రచారం మాత్రమే బీజేపీ చేసుకోవాల్సి ఉంది. అది లాంచనమే అంటున్నారు. సో బీజేపీ ఇపుడు ప్రత్యర్ధులకు అందనంత ముందున ఉంది అన్నది ఒక విశ్లేషణ.
ఇది రైటా రాంగా మతాన్ని రాజకీయాలు కలపవచ్చా అన్నది పక్కన పెడితే బీజేపీని అయోధ్య రాముడు మళ్లీ మనసారా ఆశీర్వదిస్తాడు అన్నది కాషాయం పార్టీ గట్టి నమ్మకం. తీర్పు ప్రజలు అనుకూలంగా ఇస్తారు మీరే చూస్తారు అన్నది నిబ్బరం బీజేపీది అవుతోంది.