కేంద్రంలో మోడీ సర్కారుకు బాబు అవసరం ఉందా?
దీనికి తోడు ఇంతకాలం మిత్రుల్ని.. మిత్రపక్షాలకు సరైన మర్యాద గౌరవం ఇవ్వని మోడీ అండ్ కో కు.. ఇప్పుడు వారి మీదనే ఆధారపడాల్సిన దుస్థితి.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు షాకింగ్ గా మారాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా ఫలితాలు వస్తున్న పరిస్థితి. తమకు మిత్రుల అవసరం లేదని.. తమ సొంత బలంతోనే ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపడతామన్నట్లుగా వ్యవహరించిన తీరకు భిన్నమైన వాతావరణం ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో మోడీ సర్కారుకు చంద్రసేన ఆక్సిజన్ గా మారారన్న చర్చ మొదలైంది. దీనికి తోడు ఇంతకాలం మిత్రుల్ని.. మిత్రపక్షాలకు సరైన మర్యాద గౌరవం ఇవ్వని మోడీ అండ్ కో కు.. ఇప్పుడు వారి మీదనే ఆధారపడాల్సిన దుస్థితి.
మిత్రుల విషయంలో మోడీషాలు ఎంత కఠినంగా వ్యవహరించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గడిచిన పదేళ్లుగా తమకున్న సొంత బలంతో మోడీ ఎలా వ్యవహరించారన్న విషయం తెలిసిందే. కూటమిలోని మిత్రపక్షాలకు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకపోగా.. అవసరమైతే వారి బలాన్ని తగ్గించేందుకు వెనుకాడని పరిస్థితి. ఇలాంటి వేళ.. తాజా ఎన్నికల్లో సొంత బలం లేక.. పూర్తిగా మిత్రుల మీద ఆధారపడాల్సి ఉంది.
అదెలానంటే.. మొత్తం 543 స్థానాలు ఉన్న లోక్ సభలో ప్రభుత్వ ఏర్పాటుకు 272 స్థానాల బలం అవసరం. బీజేపీకి ఇప్పటివరకు 240 స్థానాల్లోనే అధిక్యత ఉంది. అంటే.. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 32 స్థానాలు అవసరం. ఇక.. ఎన్డీయే కూటమిలో బలంగా ఉన్న పార్టీల్లో చంద్రసేనకు 18 స్థానాలు ఉన్నాయి. వీరితో పాటు మరో పద్నాలుగు స్థానాల బలం ఉంటే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఇందుకు జేడీయూ.. శివసేన మాత్రమే ఉన్నాయి. ఈ ఇద్దరిలో ఎవరిని కూడా పూర్తిగా నమ్మలేని పరిస్థితి. ఇతరులు 19 మంది ఉన్నప్పటికీ.. ఎప్పటికప్పుడు వారి దయ మీదనే ప్రభుత్వాన్ని పాలించాల్సి ఉంటుంది. ఇలాంటి వేళ.. మిత్రుల దయ లేనిదే మోడీ సర్కారు బతకలేని పరిస్థితి.
ఒకవేళ.. చంద్రసేన కానీ బీజేపీకి హ్యాండిచ్చేస్తే.. ప్రభుత్వ ఏర్పాటు కూడా కష్టమయ్యే పరిస్థితి. ఎందుకంటే.. 272 స్థానాల్లో ఎన్డీయే కూటమికి ఉన్నవి 283 స్థానాలు. అందులో చంద్రసేనవి 18. అంటే.. వీరిని మినహాయిస్తే మిగిలేవి 265 స్థానాలు. అంటే.. కొత్త మిత్రులు ఎవరూ రాకుంటే మోడీ సర్కారు ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి. ఇప్పుడు అర్థమైందా? మోడీ సర్కారుకు చంద్రసేన ఎలా ఆక్సిజన్ అవుతుందో?
ఇండియా కూటమి విషయానికి వస్తే 163 స్థానాల్లో అధిక్యతను ప్రదర్శిస్తోంది. ఇందులో కాంగ్రెస్ 99 స్థానాల్లో అధిక్యంలో ఉండగా.. డీఎంకే 21, సమాజ్ వాదీ 33, టీఎంసీ 31 స్థానాల్లో అధిక్యంలో ఉన్నాయి. వీటిల్లో ఏ పార్టీ కూడా బీజేపీతో జత కట్టే పరిస్థితి లేదు. ఈ కారణంగానే.. మోడీ సర్కారుకు రానున్న రోజుల్లో చంద్రసేన అత్యంత కీలకంగా మారనుంది.