షర్మిలను ఎవరైనా పట్టించుకుంటారా ?
ప్రతి ఒక్కళ్ళకు తెలిసిన ఈ విషయం షర్మిలకు తెలీకుండా ఉండదు. తెలిసి కూడా ప్రత్యేకహోదా డిమాండ్ తో తిరుపతిలో సభపేరుతో హడావుడి చేస్తున్నారంటే ఓవర్ యాక్షన్ అనే అనాలి.
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చాలా హడావుడి చేస్తున్నారు. ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా అందుకనే తన ఓవర యాక్షన్ను పెంచేస్తున్నారు. ఇపుడు విషయం ఏమిటంటే మార్చి 1వ తేదీన తిరుపతిలో ప్రత్యేకహోదాపై పెద్ద సభ నిర్వహించబోతున్నారు. నిజానికి ప్రత్యేకహోదా డిమాండ్ అన్నది బాగా పాతపడిపోయింది. 2014లో జరిగిన విభజన చట్టంతో ఏపీకి హక్కుగా రావల్సిన ప్రత్యేకహోదాను నరేంద్రమోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేసింది. వివిధ కారణాలతో చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి కూడా మోడీని నిలదీయలేని, ఎదిరించే స్ధితిలో లేకపోవటంతో హోదా డిమాండు అటకెక్కేసింది.
గడచిన పదేళ్ళుగా అన్నీ విషయాలను గమనిస్తున్న జనాలకు బాగా తెలుసు. ఏపీకి ప్రత్యేకహోదా రావాలంటే ఒకటే మార్గముంది. అదేమిటంటే కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం ఏపీ ఎంపీల మద్దతు ఆధారపడాల్సిరావటం. ఏపీ ఎంపీల మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే పరిస్ధితి సాధ్యం కాదన్నపుడు మాత్రమే ప్రత్యేకహోదా హామీ తీసుకుని మద్దతివ్వటం. ప్రభుత్వం ఏర్పడగానే ప్రత్యేకహోదా ఇవ్వకపోతే ఏపీ ఎంపీలు మద్దతు ఉపసంహరించుకుంటారన్న భయం ఉన్నపుడే ఏపీకి ప్రత్యేకహోదా వస్తుంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఏపీ ఎంపీల మద్దతు అవసరంలేదన్నపుడు ప్రత్యేకహోదా రాదుగాక రాదు.
ప్రతి ఒక్కళ్ళకు తెలిసిన ఈ విషయం షర్మిలకు తెలీకుండా ఉండదు. తెలిసి కూడా ప్రత్యేకహోదా డిమాండ్ తో తిరుపతిలో సభపేరుతో హడావుడి చేస్తున్నారంటే ఓవర్ యాక్షన్ అనే అనాలి. ఎన్నికల్లో లబ్దికోసం తప్ప మరోటికాదని తెలిసిపోతోంది. కాకపోతే ఎలాంటి ఉపయోగం ఉండని సబ్జెక్టు పట్టకుని షర్మిల ఆయాసపడుతున్నారన్నదే పాయింట్.
కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని రాహూల్ గాంధి మాటను షర్మిల పదేపదే చెబుతున్నారు. అసలు రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించిందే కాంగ్రెస్ పార్టీ. అందుకనే కాంగ్రెస్ అంటేనే జనాలు మండిపోతున్నారు. అలాంటి పార్టీకి అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకుని ప్రత్యేకహోదా సాధిస్తామని షర్మిల హామీలిస్తే, హడావుడి చేస్తే జనాలు పట్టించుకుంటారా ? ఏదో పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు కాబట్టి షర్మిల తన ప్రయత్నాలు తాను చేస్తున్నారంతే. వాస్తవం ఏమిటో, జరగబోయేది ఏమిటో అందరితో పాటు షర్మిలకు కూడా బాగా తెలుసు.