గ్రీన్ 'ల్యాండ్'ను అమ్మాల్సిందే.. ప్రధానితో ఫోన్ లో ట్రంప్ వాగ్వాదం

అమ్మాల్సిందే.. అమ్మేందుకు ఏం లేదు..ట్రంప్-ఫ్రెడెరిక్సన్ మధ్య ఫోన్ లో తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. వీరు 45 నిమిషాలు వాదులాడుకున్నట్లు తెలుస్తోంది.

Update: 2025-01-25 12:30 GMT

రూ.కోటి కోట్ల ఖనిజ సంపద.. భౌగోళికంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం.. ఇలాంటిచోటు కాస్త బలహీనంగా ఉంటే ఎవరైనా కన్నేయకుండా ఉంటారా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదే విధంగా వెళ్తున్నారు. అధికారంలోకి రాకముందే గ్రీన్‌ ల్యాండ్‌.. గ్రీన్ ల్యాండ్ అంటూ కలవరించిన ఆయన.. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎలాగైనా సొంతం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లున్నారు.

గ్రీన్ ల్యాండ్ స్వయంప్రతిపత్తిగల ప్రాంతం. అయితే, దీనిపై డెన్మార్క్ అదుపు ఉంటుంది. ఈ నేపథ్యంలో డెన్మార్క్‌ మహిళా ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్‌ కు ట్రంప్ ఫోన్ చేశారు. అంతేగాక తీవ్ర స్వరంతో ఆమె తో ఫోన్‌లో మాట్లాడారట.

అమ్మాల్సిందే.. అమ్మేందుకు ఏం లేదు..ట్రంప్-ఫ్రెడెరిక్సన్ మధ్య ఫోన్ లో తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. వీరు 45 నిమిషాలు వాదులాడుకున్నట్లు తెలుస్తోంది. తన ఉద్దేశం ఏమిటో ట్రంప్ ఘాటైన స్వరంతో వినిపించారట.

మీ అదుపులోని గ్రీన్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకోవడం పట్ల తాను తీవ్రంగా ఆలోచన చేస్తున్నట్లు ట్రంప్‌ చెప్పగా.. ఫ్రెడెరిక్సన్‌ సైతం అంతే దీటుగా బదులిచ్చారట. గ్రీన్ ల్యాండ్ ను అమ్మడంపై తమకు ఎలాంటి ఆసక్తి లేదని తేల్చిచెప్పారట. అయితే, డెన్మార్క్ వంటి చిన్న దేశం అధినేత తన ప్రతిపాదనను తిరస్కరించడంతో ట్రంప్ అహం దెబ్బతిన్నదో ఏమో..? ఆమెతో దూకుడుగా మాట్లాడారట. ఓ దశలో బెదిరింపులకు సైతం పాల్పడ్డారని సమాచారం. ట్రంప్‌ ఫోన్లో మాట్లాడిన తీరును చూసి తాము దిగ్భ్రాంతికి గురయ్యామని కొందరు అధికారులు చెప్పారు. డెన్మార్క్ పై చర్యలు తీసుకుంటారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. డెన్మార్క్‌ ను ట్యాక్స్ లతో శిక్షిస్తానని ట్రంప్ హెచ్చరించారట.

డెన్మార్క్‌ లో భాగం అయినప్పటికీ గ్రీన్‌ లాండ్‌ స్వయంప్రతిపత్తి కలిగిన దీవి. 2016లో అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ దీనిని సొంతం చేసుకోవాలని ట్రంప్ చూశారు. అమెరికా అధ్యక్షుడిగా చేసిన హ్యారీ ట్రూమాన్‌ సైతం గ్రీన్ ల్యాండ్ కొనుగోలును ప్రతిపాదించారు. 100 మిలియన్‌ డాలర్ల విలువైన బంగారాన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ, దానిని డెన్మార్క్‌ తిరస్కరించిందట.

గ్రీన్‌ ల్యాండ్‌లో బ్యాటరీలు, ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ఎక్కువగా వాడే రాగి, లిథియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే అమెరికా కన్నేసింది. జాతీయవాదం, ప్రజాస్వామ్యం, అంతర్జాతీయ చట్టాల దృష్ట్యా ఒక దేశాన్ని కొనడం అంత సులభమేం కాదనేది అందరి మాట.

Tags:    

Similar News