ఇంట్రెస్టింగ్ సీన్ : లోకేష్ తో బొత్స !

రాజకీయాల్లో ప్రత్యర్థులే ఉంటారు. కానీ ఏపీ రాజకీయాలు మాత్రం కొంత ప్రత్యేకంగా మారాయి.

Update: 2025-01-26 16:24 GMT

రాజకీయాల్లో ప్రత్యర్థులే ఉంటారు. కానీ ఏపీ రాజకీయాలు మాత్రం కొంత ప్రత్యేకంగా మారాయి. ఇక్కడ అంతా రాజకీయాలను దాటి ముందుకు సాగుతున్నారు. శతృవుల కంటే ఎక్కువగా భావిస్తున్నారు. దాంతో సంప్రదాయ రాజకీయాలు కలసి కూర్చుని మాట్లాడుకోవడం పలకరించుకోవడాలు ఏవీ కనిపించడం లేదు.

రాజ్ భవన్ లో ఎట్ హోం పేరుతో గవర్నర్ ఇచ్చే తేనీటి విందులో అయితే గతంలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు వచ్చేవారు వారంతా సుహృద్భావ వాతావరణంలో ముచ్చటించుకునేవారు. గత కొన్నేళ్ళుగా అది ఏపీలో అయితే కరువు అయింది.

ఇదిలా ఉండగా వైసీపీ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు అయిన బొత్స సత్యనారాయణ విజయవాడలో జరిగిన 76వ గణతంత్ర వేడుకలలో పాల్గొన్నారు. కేబినెట్ హోదా కలిగిన ఆయనకు మంత్రులతో పాటు సీటు కేటాయించారు. అయితే మంత్రి నారా లోకేష్ ప్రభుత్వంలోని మంత్రులను అలాగే ఉన్నతాధికారులను పలకరిస్తూ ఉండగా అదే వరసలో ఉన్న బొత్స సత్యనారాయణ లేచి లోకేష్ కి కరచాలనం చేశారు.

లోకేష్ కూడా బొత్సకు కరచాలనం ఇచ్చి నవ్వుతూ ఆయనను పలకరించారు. ఈ సన్నివేశం చూసేవారికి అందరికీ ఆసక్తిని గొలిపింది. వైసీపీకి చెందిన బొత్స ఈ విధంగా ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కావడం ద్వారా ఆ పార్టీ గతంలో అనుసరించిన విధానానికి భిన్నమైన తీరుని కనబరచారు.

బొత్స మండలిలో కూడా విపక్ష నేతగా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే ఆ సమయంలో మండలిలో లోకేష్ సహా ఇతర మంత్రులు కూడా జవాబులు చెబుతూంటారు. అలా బొత్స అధికార పక్షంతో ప్రభుత్వంతో కాస్తా కలివిడిగానే ఉంటున్నారు. ఆ మధ్యన ప్రజా పద్దుల కమిటీకి ఎనికలు జరిగినపుడు కూడా శాసనసభ ఆవరణలో అటుగా తన కారు వైపు వెళ్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కూడా బొత్స పలకరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

బొత్స రాజకీయంగా సీనియర్ గా ఉన్నారు. ఆయన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. పీసీసీ చీఫ్ గా ఉమ్మడి ఏపీలో ఉన్నారు. ఆయనకు ఇవన్నీ మామూలే. కానీ వైసీపీ మాత్రం అధికార పక్షానికి దూరంగా ఉంటోంది. ప్రభుత్వం నిర్వహించే ఏ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. అయితే బొత్సకు ఆ ఫ్రీడం ఉందని ఆయన వెళ్తున్నట్లుగా ఉన్నారని అంటున్నారు.

అంతే కాదు ఆయనకు అధికార ముఖ్యులతో ఉన్న పరిచయాలతో వారితో ముచ్చటిస్తున్నారు. దాంతో వైసీపీ నుంచి ఎవరు కనిపించకపోయినా బొత్స మాత్రం వస్తూ గత సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. మరి ఇది వైసీపీ హై కమాండ్ కి సమ్మతమేనా అన్నది కూడా చర్చగా ఉంది.

అదే సమయంలో బొత్స వంటి సీనియర్ ని నియంత్రించే పరిస్థితి కూడా ఉండదని అంటున్నారు. మరో వైపు చూస్తే బొత్స ఇపుడు కీలకమైన పదవిలో ఉన్నారు. వైసీపీ మొత్తంలో ఆయనే యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఇక వైసీపీలో చూస్తే బిగ్ షాట్స్ చాలా మంది తప్పుకుంటున్నారు. ఈ సమయంలో ఎంతటి పెద్ద నాయకులు అయినా వారి విధేయతలు మీద ఎన్నడూ లేని విధంగా సందేహాలు వస్తున్నాయి. అయినా ఇపుడు వైసీపీ ఉన్న రాజకీయ ఒత్తిళ్ళు సంక్షోభాల నేపథ్యంలో ఏమీ చేయలేని పరిస్థితి ఉందని అంటున్నారు.

Tags:    

Similar News