ఒకటో తేదీ నుంచి భూమి రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు : మంత్రి అనగాని
ఏపీలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు
ఏపీలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అదేవిధంగా భూముల హేతుబద్ధీకరణకు నిర్ణయించినట్లు వెల్లడించారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో భూముల రేట్లు పెరగవని, విజయవాడ, విశాఖ, భోగాపురం వంటి ప్రాంతాల్లో భూముల విలువ పెరుగుతుందని వివరించారు.
అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో రెవెన్యూ శాఖపై కీలక అప్డేట్లను వెల్లడించారు మంత్రి అనగాని సత్యప్రసాద్. గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న అరాచకాలతో ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. రెవెన్యూ సదస్సుల ద్వారా తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించామని వివరించారు. పేదలకు చెందిన భూములను మార్చే అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా, ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ల విలువలు పెరగున్నాయని, కానీ, రాజధాని పరిధిలోని గ్రామాలను మినహాయింపు ఇచ్చామని తెలిపారు. కాగా, విశాఖలోని సింహాచలం పంచ గ్రమాల భూముల సమస్యపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.
ఇక భూముల విలువ ఎక్కడెక్కడ తగ్గించాలనే విషయాలపై జనవరి 15వ తేదీకల్లా నివేదిక సమర్పించాలని గతంలోనే ప్రభుత్వం ఆదేశించింది. భూముల విలువ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, అభివృద్ధి చెందిన ఏరియాల్లోని భూముల ధరలను సవరించినట్లు చెప్పారు. గుంటూరు, మార్కాపురం తదితర ప్రాంతాల్లో బుక్ వాల్యూ తక్కువే ఉందని మంత్రి తెలిపారు. కొన్నిచోట్ల తగ్గిస్తే, మరికొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయన్నారు. నాలా పన్ను కూడా రేషనలైజ్ చేస్తున్నామని మంత్రి వివరించారు. గ్రోత్ కారిడార్లలో రిజిస్ట్రేషన్ విలువల పెంపు ఉంటుందని చెప్పారు.