విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించిన నారా లోకేష్!
వైసీపీ అధినేత జగన్ తన సొంత మీడియాను అడ్డు పెట్టుకుని తనపై వికృత ప్రచారం చేశారని.. తనపై అభూత కల్పనలతో ఆధార రహితమైన కథనాలను వండి వార్చారని టీడీపీ నేత, మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
వైసీపీ అధినేత జగన్ తన సొంత మీడియాను అడ్డు పెట్టుకుని తనపై వికృత ప్రచారం చేశారని.. తనపై అభూత కల్పనలతో ఆధార రహితమైన కథనాలను వండి వార్చారని టీడీపీ నేత, మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తన పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా జగన్ మీడియా చేసిన యాగీపై తన న్యా య పోరాటం ఆగబోదన్నారు. జగన్ మీడియాపై ఎంత వరకైనా పోరాడతానని లోకేష్ స్పష్టం చేశారు. తా జాగా జగన్ మీడియాపై గతంలో వేసిన పరువు నష్టం కేసు విచారణ నిమిత్తం ఆయన విశాఖ కోర్టుకు వచ్చా రు.
అయితే.. ఈ కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది. అనంతరం నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. జగన్ మీడియా తనపై చేసిన దుష్పచారానికి తగిన మూల్యం చెల్లించాల్సిందేనని చెప్పారు. తాజాగా జరిగిన విచారణకు జగన్ మీడియా తరఫు న్యాయవాది రాకపోవడంతో వాయిదా పడిందన్నారు. ఇప్పటికే అనేక సార్లు తాను విచారణకు వచ్చానని.. ఎన్నిసార్లు వాయిదా పడినా వస్తానని కేసును మాత్రం వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరన్నారు.
ఇక, విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించిన నారా లోకేష్.. జగన్‌పై నమ్మకం లేకపోవడంతోనే నాయకులు ఒక్కొక్కరుగా పార్టీ వదిలేస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్‌పై ఆయన తల్లి, చెల్లెళ్లకే నమ్మకం లేదని.. ఇతర నాయకులకు ఎందుకు ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల నాటికి జగన్ ఒక్కరే మిగిలే అవకాశం ఉంటుందన్నారు. దావోస్ సదస్సుకు సంబంధించి ఓ వర్గం తమపై లేనిపోని నిందలు వేస్తోందని నారా లోకేష్ అన్నారు. జగన్ హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు ఎందుకు రాలేదో చెప్పాలని నిలదీశారు.
జగన్ హయాంలో పారిశ్రామిక వేత్తలను వేధించినకారణంగానే రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడుతున్నారని నారా లోకేష్ అన్నారు. తిరుపతిలో ఉన్న అమరరాజా కంపెనీని వేధించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఉందని.. అందుకే అక్కడ భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలపై విచారణ కొనసాగిస్తామని లోకేష్ చెప్పారు. అయితే.. రాత్రికి రాత్రి ఏదీ జరిగిపోదని, నెమ్మదిగా ఒక్కొక్కరి పని పడతామన్నారు.