త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.. కాస్త తేడా వచ్చినా ఘోరమే

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ట్ ట్రంప్ పై జరిగిన కాల్పుల ఉదంతాన్ని నిశితంగా గమనిస్తే.. ఆయనకు ఈ ఘటన పునర్ జన్మగా చెప్పాలి

Update: 2024-07-14 04:05 GMT

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ట్ ట్రంప్ పై జరిగిన కాల్పుల ఉదంతాన్ని నిశితంగా గమనిస్తే.. ఆయనకు ఈ ఘటన పునర్ జన్మగా చెప్పాలి. కారణం.. ఆయన ఎంతటి ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నారన్నది అర్థమవుతుంది. తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ ఉత్సాహపూరింతంగా మాట్లాడుతున్న ట్రంప్.. హటాత్తుగా తన చేతిని చెవి వెనక్కి పెట్టుకోవటం.. వెంటనే ఆయన కిందకు వంగటం కనిపిస్తుంది.

78 ఏళ్ల వయసులో అంత వేగంగా రియాక్టు కావటం చూస్తే.. శారీరకంగా..మానసికంగా ట్రంప్ ఎంత బలంగా ఉన్నారన్నది అర్థమవుతుంది. ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన వివరాల్ని మరింత జాగ్రత్తగా చూస్తే.. చెవి వెనుకకు తగిలిన బుల్లెట్.. కాస్త పక్కకు వెళ్లి ఉంటే? అన్న ఆలోచనే వణికించేలా ఉంది. అయితే.. చెవి వెనుక తగిలిన బుల్లెట్ శరీరంలోకి దిగిందా? లేదంటే పక్కకు రాసుకుంటూ పోయిందా? గాయం తీవ్రత ఎంత? అన్న ప్రశ్నలకు సమాధానాలు బయటకు రాలేదు. కాకుంటే.. కాల్పులు జరిగిన నిమిషం తర్వాత పైకి లేచిన ట్రంప్ ను చూసినప్పుడు ఆయన చెవి వెనుక నుంచి మెడ మీదగా రక్తం కారుతున్న వైనం కనిపించింది.

ఈ కాల్పులు ఉదంతం నుంచి ట్రంప్ లక్కీగా బయటపడ్డారన్న వాదన వినిపిస్తోంది. టార్గెట్ కాస్త తేడా కొట్టినా ఘోరం జరిగేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించినట్లుగా (ఒకరు కాల్పులు జరిపిన వ్యక్తి.. మరొకరు సభకు వచ్చిన వ్యక్తిగా చెబుతున్నారు) మరికొందరు గాయపడినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఒక ఘోర ఘటన త్రుటిలో తప్పినట్లుగా చెప్పక తప్పదు.

తనపై కాల్పుల జరిగిన వైనంపై ట్రంప్ స్పందించినట్లుగా ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ పేర్కొంది. ‘‘నా చెవుల దగ్గర కరకు శబ్దం వినిపించింది. బుల్లెట్ నా చర్మాన్ని చీల్చుకుంటూ వెళ్లినట్లుగా అనిపించింది. కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరో.. ఎంటో ఇంకా తెలీదు. అతను ఇప్పుడు చనిపోయాడు. ఈ దేశంలో ఇలాంటి ఘటన జరుగుతుందని నేను ఊహించలేదు’’ అని ట్రంప్ అన్నట్లుగా పేర్కొన్నారు.

Tags:    

Similar News