కాంగ్రెస్ చేతకానితనంతో ‘డొనేట్ ఫర్ దేశ్’ ప్రోగ్రాంకు దెబ్బ!
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన.. 'డొనేట్ ఫర్ దేశ్’ ప్రోగ్రాం పేరుతో క్రౌడ్ ఫండింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఒక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు.. దానికి ఎదురయ్యే అడ్డంకులు.. అవాంతరాల గురించిన ఆలోచన చేయాల్సి ఉంటుంది కదా? అందునా మోడీలాంటి నేత బీజేపీకి కొండంత అండగా ఉన్నప్పుడు.. ఆయన్ను ఎదుర్కోవాలంటే మామూలు ప్లానింగ్ ఏ పాటికి. పదేళ్లుగా మోడీ ప్రభను చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఆ మాత్రం సోయి లేకుండా ఉండటం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన.. 'డొనేట్ ఫర్ దేశ్’ ప్రోగ్రాం పేరుతో క్రౌడ్ ఫండింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే.. ఈ ప్రోగ్రాంను రూపొందించిన కాంగ్రెస్ డిజిటల్ విభాగం.. ఆ పేరుతో ఒక వెబ్ సైట్ ను కూడా తమ పేరుతో రిజిస్టర్ చేసుకోవాలన్న విషయాన్ని మరిచారు. దీంతో.. ఈ లోపాన్ని గుర్తించిన మోడీ సానుభూతిపరుడు.. ఒక మేజిక్ చేశారు. 'డొనేట్ ఫర్ దేశ్’ ప్రోగ్రాంకు ఆకర్షితులై.. వెబ్ సైట్ కు వెళ్లి అక్కడి నుంచి డబ్బులు డొనేట్ చేయాలనుకున్న వారు.. ఆ పేజీ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తే.. అది కాస్తా బీజేపీకి చెందిన విరాళాల పేజీకి వెళుతుండటంతో అవాక్కు అయ్యే పరిస్థితి.
ఎందుకిలా అంటే.. బీజేపీ సానుభూతిపరుడు ఎవరో 'డొనేట్ ఫర్ దేశ్’ పేరుతో ఉండే డొమైన్ ను కొనుగోలు చేసి.. దాన్ని సెర్చ్ చేసే వారికి బీజేపీకి చెందిన డొనేషన్ పేజీకి వెళ్లేలా రీడైరెక్ట్ చేయటంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన కాంగ్రెస్ తీరును పలువురు తీవ్రంగా తప్పుపడుతున్నారు. జాతీయస్థాయిలో ఇంత పెద్ద ప్రోగ్రాంను ఏర్పాటు చేసినప్పుడు.. ఆ ప్రోగ్రాం పేరుతో డొమైన్ ను సొంతం చేసుకోవాలన్న జాగ్రత్త లేకపోవటం దేనికి నిదర్శనం? అని ప్రశ్నిస్తున్నారు.
ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవటాన్ని కాంగ్రెస్ ను.. ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్ ను విమర్శలతో ఉతికి ఆరేస్తున్నారు. మోడీ మీద యుద్ధం చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీకి సీరియస్ నెస్ లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కళ్లు తెరిచి కాంగ్రెస్ హడావుడిగా www.donateinc.in పేరుతో కొత్త డొమైన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కాంగ్రెస్ మద్దతుదారులకు ఈ అంశంపై క్లారిటీ వచ్చేందుకు వీలుగా రాహుల్ గాంధీ స్వయంగా ఈ డొమైన పేరును ట్వీట్ చేయటం గమనార్హం. అదేదోకాస్తంత ముందుగా ప్లాన్ చేసి ఉంటే.. ఈ అవస్థలు తప్పేవి కదా? అన్న మాట వినిపిస్తోంది.