తమ్ముళ్ళకు తడిగుడ్డేనా...!?

టికెట్ దక్కలేదని చింత వలదు నిరుత్సాహం అంత కంటే వలదు ఇదే చంద్రబాబు అధినేత హోదాలో తమ్ముళ్లకు ఇచ్చిన సందేశం.

Update: 2024-02-17 01:30 GMT

తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళకు కూల్ గా ఒక కబురు అందింది. మీరు త్యాగాలు చేయాల్సిందే అన్నదే ఆ కబురు. టికెట్ ఇవ్వలేకపోవచ్చు అని సాక్షాత్తు అధినేత చంద్రబాబు చెప్పేశారు. అందువల్ల ఎవరూ నిరాశ చెందవద్దు అని గీతోపదేశం చేశారు. టికెట్ దక్కలేదని చింత వలదు నిరుత్సాహం అంత కంటే వలదు ఇదే చంద్రబాబు అధినేత హోదాలో తమ్ముళ్లకు ఇచ్చిన సందేశం.

ఈసారి పొత్తులతో వెళ్తున్నామని బాబు చెప్పారు.అందువల్ల అంతా సహకరించాలని ఆయన ఓపెన్ అప్పీల్ చేశారు. పొత్తులకు సహకరించి పార్టీ విజయానికి ఎవరైతే కష్టపడతారో వారిని గుర్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చాక తగిన ప్రాధాన్యత ఇస్తామని బాబు ఒక భారీ హామీ ఇచ్చారు.

ఇక చంద్రబాబు చెప్పిన దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. కేవలం పొత్తుల వల్లనే తమ్ముళ్ల ఆశలకు చిల్లు పడడంలేదు వైసీపీ నుంచి కూడా పెద్ద ఎత్తున ముఖ్య నాయకులు అంతా వచ్చి చేరుతున్నారు అని బాబు సంకేతాలు ఇచ్చేశారు. అంటే వారితో కూడా కలసి పనిచేయాలని దిశానిర్దేశం చేసారు. అలా చేరికలను తమ్ముళ్లే తాముగా ప్రోత్సహిస్తూ పార్టీ విజయానికి బాటకు వేయాలని ఆయన కోరుకున్నారు.

మొత్తం మీద చూస్తే తమ్ముళ్లకు చాలా మటుకు ఈసారి అవకాశాలు దక్కవని బాబు ఇచ్చిన సందేశం. మొత్తం 175 సీట్లలో జనసేన బీజేపీ పొత్తుల కారణంగా టీడీపీ ఎన్ని సీట్లకు పోటీ చేస్తుందన్నది మాత్రం ఈ రోజుకీ తెలియడంలేదు. మరో వైపు చూస్తే వైసీపీ నుంచి సమర్ధులు సత్తా ఉన్న నేతలు వస్తే వారికి టికెట్లు ఇస్తామని అంటున్నారు.

ఎందుకంటే అయిదేళ్ల పాటు అధికారంలో ఉంటూ వచ్చిన వైసీపీ నేతలు డబ్బుకు వెనకాడరు, దాంతో పాటు వారు సిట్టింగులుగా ఉంటారు కాబట్టి వారికి జనాలతో కనెక్షన్ ఎక్కువ. ఈ విషయాలు అన్నీ కూడా టీడీపీ హై కమాండ్ లెక్క వేసుకుని మరీ వైసీపీ వారిని తమ పార్టీలో చేరేందుకు ఆహ్వానిస్తోంది అని అంటున్నారు

ఇక ఇవన్నీ లెక్క వేసి హెచ్చిస్తే మాత్రం చాలా చోట్ల తమ్ముళ్ల సీటు చిరిగిపోవడం ఖాయమని అంటున్నారు. తక్కువలో తక్కువ యాభై నుంచి అరవై సీట్లలో తమ్ముళ్ల ఆశలకు కోత పడడం ఖాయమని అంటున్నారు. అదే కనుక జరిగితే ఎంతో మంది తమ్ముళ్ళు త్యాగరాజులుగా మారిపోతారు.

ఇక టీడీపీ ప్రభుత్వం వచ్చాక అవకాశాలు కల్పిస్తామని అంటున్నారు. ప్రతీ నియోజకవర్గంలో కనీసం ఇద్దరు ముగ్గురు గట్టి ఆశావహులు ఉన్నారు. అలా పెద్ద సంఖ్యలో ఉన్న వారిలో ఎంతమందిని రేపు ప్రభుత్వంలోకి వచ్చాక అకామిడేట్ చేస్తారో ఎవరూ చెప్పలేని విషయం. అదే సమయంలో మిత్ర పక్షాలు అక్కడ కూడా వాటా కోసం పట్టుబడతారు. మరి అలా ఈ పొత్తులు అపుడూ కంటిన్యూ అయితే చాలా మంది తమ్ముళ్ళ నెత్తిన తడిగుడ్డే అంటున్నారు. మరి చంద్రబాబు చెప్పినట్లుగా మాట విని పార్టీని సహకరించే తమ్ముళ్ళు ఎంత మంది అన్నది ఒక కీలకమైన చర్చ.

ఇంతే కాదు తన సొంత సీట్లో తాము డమ్మీలుగా ఉండి మిత్ర పక్షాలను గెలిపిస్తే రేపటి రోజున వారు బలంగా పాతుకుపోతే తమ రాజకీయానికి అసలుకే ఎసరు వస్తుంది అన్నది నిజమైన ఆందోళన. దాంతో తమ్ముళ్ళు ఈ ఒక్కసారికీ టికెట్ దక్కకపోవడం కింద చూడడంలేదు. టోటల్ తమ పాలిటిక్స్ కే ఈ పొత్తులు ఎసరు అన్న బాధ చాలా మందిలో ఉంది. మరి బాబు మాత్రం మీరు తగ్గాల్సిందే అని చెప్పేస్తున్నారు.

Tags:    

Similar News