'గోదారోళ్ల అన్నపూర్ణమ్మ'.. డొక్కా సీతమ్మ గురించి మీకు తెలుసా?
అవును... డొక్కా సీతామ్మ అంటే గోదారోళ్ల అన్నపూర్ణమ్మే! ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, మండపేటలో 1841లో డొక్కా సీతమ్మ జన్మించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనానికి కూటమి ప్రభుత్వం డొక్కా సీతమ్మ పేరు పెట్టి గౌరవించింది. దీంతో.. మరోసారి డొక్కా సీతమ్మ గురించిన చర్చ బలంగా మొదలైంది. ఈ నేపథ్యంలో... ఆమె గురించి చాలా మందికి కొంతైనా తెలుసు.. ఇంకా చాలా మందికి ఆ కొంతకూడా తెలియదనే చెప్పాలి. ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ ఎవరు.. ఆమెను “గోదారోళ్ల అన్నపూర్ణమ్మ”గా ఎందుకు పిలుస్తారు.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం!!
అవును... డొక్కా సీతామ్మ అంటే గోదారోళ్ల అన్నపూర్ణమ్మే! ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, మండపేటలో 1841లో డొక్కా సీతమ్మ జన్మించారు. అయితే ఆమె చిన్నతనంలోనే తల్లి నరసమ్మ చనిపోవడంతో ఇంటిపనులు చక్కదిద్దే బాధ్యత, పరులకు సేవ చేయడం సీతమ్మకు అలవడ్డాయి. ఆమె తండ్రి భవానీ శంకరాన్ని అంతా "బువ్వన్న" అని పిలుస్తారు. సుమారు నాలుగు దశాబ్ధాల పాటు ఆమె సేవాప్రస్థానం నిర్విరామంగా కొనసాగింది.
ఇక సీతమ్మకు లంకల గన్నవరం గ్రామానికి చెందిన వేదపండితులు డొక్కా జోగన్నతో వివాహం అయ్యింది. ఈ ప్రతిపాదన తెచ్చిన సమయంలోనే... ఆకలి అని వచ్చేవారికి అన్నంపెట్టే అవకాశం ఇస్తేనే వివాహం చేసుకుంటాననే కండిషన్ సీతమ్మ పెట్టడంతో.. అందుకు జోగన్న అంగీకరించి సీతమ్మను మనువాడారు. సీతమ్మ... పేదల పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు సైతం సాయాన్ని అందించేవారు.
వివాహం అనంతరం.. ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో ఉన్న లంకల గన్నవరం గ్రామానికి కాపురానికి వచ్చిన సీతమ్మ ఇంట్లో పాడిపంటలకు ఏమాత్రం కొరత ఉండేది కాదు. ఈ క్రమంలో రోజూ వందలమంది బాటసారులు, పేదలకు ఆమె ఉచితంగా భోజనాలు పెట్టేవారు. ఇక, వరదల సమయంలో స్వయంగా ఆమె, తన భర్తతో కలిసి వెళ్లి వరదల్లో చిక్కుకున్నవారి ఆకలిదప్పులు తీర్చేవారు.
ఇక డొక్కా సీతమ్మ పేరిట సుమారు 58ఏళ్ల క్రితమే నిడదవోలులో స్వాతంత్ర్య సమరయోధుడు చింతలపాటి మూర్తిరాజు.. ఉన్నత పాఠశాల ఏర్పాటు చేశారు. మూర్తిరాజు ధర్మసంస్థల తరుపున ఏర్పాటైన ఈ పాఠశాల... "డొక్కా సీతమ్మ ఓరియంటల్ పురపాలక ఉన్నత పాఠశాల"గా నడుస్తోంది. ఇక్కడ ఆరో తరగతి నుంచి పదోతరగతి వరకూ తరగతులు నిర్వహిస్తున్నారు.
ఇదే క్రమంలో... రాజోలు మండలం పొదలాడకు చెందిన ఎమ్మెస్ సూర్యనారాయణ 2002లో "దయామేఘ మల్హరి" అనే కావ్యం రాశారు. ఈ కావ్యంలో... "నీ కళ్ల వాకిళ్లలోన వేలాడిన పాలకుండ.. చద్దికుండ.. ఆకలి పేగుల గుండా గొర్లిన అమృత కళశాలు కదా.."! "అమ్మా... నీది బిగించిన పిడికిలి, తెరిచిన వాకిలి, వడ్డించిన విస్తరి, వర్షించిన దయామేఘ మల్హరి.." అంటూ ఆయన అద్భుతంగా అక్షరమయం చేశారు!