విశాఖ సౌత్ నుంచి ద్రోణం రాజు కోడలు ..!?
విశాఖలో పేరెన్నిక కన్న రాజకీయ కుటుంబం ద్రోణం రాజు సత్యనారాయణది. ఆయన సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నారు
విశాఖలో పేరెన్నిక కన్న రాజకీయ కుటుంబం ద్రోణం రాజు సత్యనారాయణది. ఆయన సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన రాజకీయ వారసుడిగా ద్రోణం రాజు శ్రీనివాస్ రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసారు. కరోనా మొదటి విడత వేవ్ లో ఆయన మరణించారు.
ఆయన రాజకీయ వారసుడిగా కుమారుడు ద్రోణం రాజు శ్రీవాత్సవ ఉన్నారు. అయితే ఆయన వయసులో చిన్న వారు కావడంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే విషయం వైసీపీ అధినాయకత్వం పరిశీలిస్తోంది. ఇదిలా ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలో పాతవారిని కలుపుకుని పోయే విషయంలో విఫలం అయ్యారు.
దాంతో విశాఖ సౌత్ లో వర్గ పోరు అధికాంగా ఉంది. దానికి తోడు మూడు సార్లు పోటీ చేసి రెండు సార్లు గెలిచిన వాసుపల్లి మీద జనంలో కూడా యాంటీ ఇంకెంబెన్సీ తీవ్ర స్థాయిలో ఉంది. ఇవన్నీ ఉన్నా కూడా ఆయన పట్ల నిన్నటి దాకా వైసీపీ హై కమాండ్ కి బీసీ అని ఒక భావం ఉండేది.
కానీ సంక్రాంతి పండుగ వేళ వాసుపల్లి చేసిన రచ్చతో ఆయన మీద వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. పండుగ రోజున మందూ ముక్క అ అంటూ ఏకంగా తన విద్యా సంస్థ నుంచే పంపిణీ చేయడంతో పాటు అది కాస్తా కంపు కొట్టే రాజకీయంగా మారిపోయింది. విపక్షాలు అన్నీ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చాయి.
ఇక వాసుపల్లి మీద వ్యతిరేకతతో వైసీపీ కార్పోరేటర్లు కూడా తిరుగుబాటలో పయనిస్తున్నారు. ఇవన్నీ చూసిన వైసీపీ అధినాయకత్వం విశాఖ సౌత్ సీటు విషయంలో సీరియస్ గా ఆలోచిస్తోంది అని అంటున్నారు. ఆ సీటుని ద్రోణం రాజు సత్యనారాయణ కోడలు, శ్రీనివాస్ సతీమణికి ఇవ్వాలని దాదాపుగా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
విశాఖ సౌత్ లో బ్రాహ్మణ సామాజిక వర్గం అధికంగా ఉంటారు కాబట్టి ఆ ఓట్లు టర్న్ అవుతాయని, మొత్తం సౌత్ లో గ్రూపులు అన్నీ కూడా ఒక్కటిగా పనిచేస్తాయని అంటున్నారు. ఇక వాసుపల్లికి ఎమ్మెల్సీ ఇస్తామని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తారు అని అంటున్నారు. ఆయన నో అంటే కనుక వైసీపీ కూడా ఏమీ చేసేది లేదని అంటున్నారు.
దాదాపుగా లక్ష ఓట్లు మాత్రమే ఉన్న అతి చిన్న నియోజకవర్గం విశాఖ సౌత్. ఇక్కడ టీడీపీ గట్టిగా ఉంది. వైసీపీకి బలం ఉన్నా కూడా వర్గ పోరు వల్ల ఇబ్బంది పడుతోంది. అభ్యర్ధిని మార్చితే మైనారిటీ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎస్ ఏ రహమాన్ వంటి వారు కూడా సహకరిస్తారు అని ఆలోచిస్తున్నారుట.
ఇక ద్రోణం రాజు కోడలిది కూడా రాజకీయ కుటుంబమే అంటున్నారు. కోన రఘుపతితో వారికి చుట్టరికం ఉంది. ఇలా అన్నీ కలసి రావడం బ్రాహ్మణులకు ఏపీలో సీట్లు ఇవ్వలేదని వైసీపీ మీద ఉన్న విమర్శల నేపధ్యంలో ద్రోణం రాజు ఫ్యామిలీకి న్యాయం చేస్తారు అని అంటున్నారు. అది రెండిందాల పార్టీకి ఉపయోగపడుతుంది అని అంటున్నారు.