దూబగుంట రోశమ్మా...క్షమించమ్మా !

ఆమెకు మద్యం అంటే అసహ్యం. ఆగ్రహం, అసహనం. ఆమె పేరే దూబగుంట రోశమ్మ. దూబగుంట ఆమె ఇంటి పేరు కాదు, ఊరి పేరు.

Update: 2024-10-18 03:55 GMT

ఆమెకు మద్యం అంటే అసహ్యం. ఆగ్రహం, అసహనం. ఆమె పేరే దూబగుంట రోశమ్మ. దూబగుంట ఆమె ఇంటి పేరు కాదు, ఊరి పేరు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని దూబగుంట అనే ఓ కుగ్రామం ఈమె స్వగ్రామం. ఈమె అసలు పేరు వర్ధినేని రోశమ్మ. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన రోశమ్మ సారా వ్యతిరేక ఉద్యమాన్ని ఉమ్మడి ఏపీలో చేపట్టి చరిత్రకు ఎక్కారు.

ఒక మామూలు మహిళ అ సాధారణ మహిళగా మారారు. మద్యం వల్ల కూలిన కుటుంబాలు చితికిన బతుకుల విలువ ఆమెకు మాత్రమే తెలుసు. భర్త మరణంతో తన ఇద్దరు కుమారులను కష్టపడి పెంచి పెద్ద వారిని చేస్తే వారు సారాకు అలవాటు పడి ఇలూ ఒల్లూ గుల్ల చేసుకున్నారు. కళ్ళ ముందే చెట్టంత కొడుకులు ఇలా పాడవడంతో ఆమె సారా మీద మద్యం మీద పగ పట్టారు.

అది తన ఊరిలో ఉండకూడదు అనుకున్నారు. అలా తన కుటుంబం నుంచి వచ్చిన బాధతో ఆమె ఉద్యమ బాట పట్టారు. అలా దూబగుంట రోశమ్మ సారా వ్యతిరేక ఉద్యమ సారథిగా మారారు. తన సొంత ఊరు దూబగుంట నుండి ప్రారంభించిన సారా వ్యతిరేక ఉద్యమం వెల్లువలా విస్తరించడంతో ఈమె పేరు దూబగుంట రోశమ్మ గా స్థిరపడింది

మద్యానికి బానిస అయిన మగావడి వల్ల గృహ హింస ఏ విధంగా ఉంటుందో ఆ ఇంటి దీపం ఎలా ఆరిపోతుందో స్వయంగా అనుభవించిన ఆమె మద్యం వద్దు ని ఉద్యమించారు. 1992 ప్రాంతంలో ఆమె ఉద్యమిస్తే ఆనాటి ప్రతిపక్ష నేత టీడీపీ ప్రెసిడెంట్ ఎన్టీఆర్ ఆమెకు మద్దతుగా నిలిచారు. తాను అధికారంలోకి వస్తే సంపూర్ణ మధ్య నిషేధం ఏపీలో పెడతాను అని నాడే హామీ ఇచ్చారు.

అలా 1994లో అధికారంలోకి వచ్చిన అన్న గారు ఇచ్చిన మాట ప్రకారం సంపూర్ణ మద్య నిషేధం చేపట్టారు. ఇదంతా దూబగుంట రోశమ్మ వల్లనే సాధ్యపడింది. ఒక మహిళ చేసిన పోరాటం ఇది. మహిళలకు అత్యధికంగా మద్యపాన ప్రియుల వల్ల ఇబ్బంది అని ఆమె భావించారు. ఈ స్టోరీ అంతా ఎందుకు అంటే ఈ రోజున ఏపీలో మద్యం దుకాణాలను తీసుకుని నడిపేందుకు మహిళలు సిద్ధం అయ్యాక చూసి మాత్రమే.

ఏపీలో మద్యం దుకాణాలు మహిళల పరం చాలా అయ్యాయి. అందులో విశాఖలో అత్యధికంగా వారికి దక్కాయి. ఏకంగా 26 షాపులు వారి పరం అయ్యాయి. కాదేదీ అనర్హం అన్నట్లుగా మహిళలు ఈ మద్యం దుకాణాలు తీసుకుని నడుపుతామని చెబుతున్నారు. ఒక వైద్యురాలు కూడా మద్యం షాపు తీసుకున్నారు.

మద్యం వ్యాపారం ఇబ్బంది కదా లేడీస్ కి అంటే అదేమి లేదు ఇది కూడా ఒక బిజినెస్ అని చెబుతున్నారు. దీనిని నిర్వహించడం తమకు ఆనందమే అని మహిళలు చెప్పడం విశేషం. మరో వైపు చూస్తే సిండికేట్ తరఫునే చాలా మంది మహిళలు ఉన్నారు.

ఇక ఏపీవ్యాప్తంగా చూస్తే 10 శాతం మద్యం దుకాణాలు మహిళలకే దక్కాయి అని రికార్డులు చెబుతున్నాయి. మరి ఇవన్నీ చూసినపుడు ఆకాశంలో సగం అవకాశంలో సగం అని మహిళలు ముందుకు వచ్చారని అనుకోవాలా లేక మహిళలు పూర్తిగా వ్యతిరేకించే మద్యం వ్యాపారంలోకి వారు రావడం పురోగతి అనుకోవాలో అర్థం కావడం లేదని అంటున్నారు.

అంతే కాదు ఈ రోజుకీ గుడి బడి ముఖ్యమైన చోట్ల మద్యం దుకాణాలు పెట్టవద్దంటూ ఆందోళనలు చేసేది మహిళలే, ఇల్లు ఒల్లూ గుల్ల అవుతుందని బాధ పడేది మహిళలే. ఒకనాడు మద్యపాన నిషేధం కోసం ఉద్యమించిన దూబగుంట రోశమ్మ కూడా మహిళే. ఇవన్నీ చూసినపుడు లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అని పాట పాడుకోవాలా లేక కాలం మారింది అనుకోవాలా అన్నది కూడా తెలియడం లేదు.

ఏది ఏమైనా ఇదే నేల మీద దూబగుంట రోశమ్మ చీర కొంగు బిగించి ఉమ్మడి ఏపీ పొలిమేరలలో మద్యం అన్నది లేకుండా ఎన్టీఆర్ ఎనిమిది నెలల పాలనలో చూపించారు. మరి ఇపుడు మహిళలే ఇలా మద్యం వ్యాపారంలో ఉన్నారు అంటే ఎక్కడో స్వర్గంలో ఉన్న రోశమ్మ ఆత్మ శాంతిస్తుందా. అందుకే రోశమ్మ మమ్మల్ని క్షమించమ్మా అని ఒక్క మాట ఆమెకు చెప్పడం తప్ప చేయగలిగేది ఏదీ లేదనే అంటున్నారు.

Tags:    

Similar News