జగన్ కోసం ఆత్మాహుతి బాంబర్‌గా మారతా: దువ్వాడ సంచలన వ్యాఖ్యలు
ఈ క్రమంలో తాజాగా టెక్కలి వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ''సీఎం జగన్‌ను కాపాడుకునేందుకు, ఆయన ప్రాణాలకు అడ్డు పడేందుకు అవసరమైతే
వైసీపీ నాయకుడు, శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ కోసం అవసరమైతే.. తాను ఆత్మాహుతి(సూసైడ్) బాంబర్‌గా మారతానని ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రాణాలు రక్షించేందుకు తాను సూసైడ్ బాంబర్‌గా మారేందుకు సిద్ధమేనని తాజాగా ఆయన ప్రకటించారు. ఇటీవల విజయవాడ శివారు ప్రాంతంలో సీఎం జగన్‌పై రాయి దాడి జరిగిన ఘటన తెలిసిందే.
ఈ నేపథ్యంలో వైసీపీ వీరవిధేయులు, సీఎం జగన్‌కు ప్రాణం ఇచ్చే నాయకులుగా పేరున్న వారు.. తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. వీరిలో మంత్రి అంబటి రాంబాబు, మంత్రి బొత్స సత్యనారా యణ ఉన్నారు. వీరు.. రాయి దాడి వెనుక టీడీపీ హస్తంఉందంటూ.. తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతే కాదు.. టీడీపీ నేతలను విచారిస్తేనే విషయం బయటపడుతుందని కూడా చెబుతున్నారు. అంతేకాదు.. చంద్రబాబును కూడా విచారించాల్సి ఉంటుందని బొత్స మరింత దూకుడు ప్రదర్శించారు.
ఈ క్రమంలో తాజాగా టెక్కలి వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ''సీఎం జగన్‌ను కాపాడుకునేందుకు, ఆయన ప్రాణాలకు అడ్డు పడేందుకు అవసరమైతే.. నేను ఆత్మాహుతి బాంబర్‌గా మారుతా!. ఎవరైనా జగన్‌పై దాడి చేయాలని చూస్తే.. వారి అంతు చూస్తా. ఈ క్రమంలో ఆత్మాహుతి బాంబర్‌గా మారి చెలరేగిపోతా. నేను మాత్రమేకాదు.. రాష్ట్రంలోని లక్షల మంది ప్రజలు కూడా సూసైడ్ బాంబర్లుగా మారేందుకు సిద్ధంగా ఉన్నారు'' అని తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఎన్నికల నిబంధనల మేరకు.. ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు, పోటీలో ఉన్నవారు ఎవరూ కూడా.. ప్రజలను, ఓటర్లను రెచ్చగొట్టేలా మాట్టాడకూడదు. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ ఇలా .. తనను తాను ఆత్మాహుతి బాంబర్‌గా పేర్కొనడంతోపాటు.. ప్రజలు కూడా ఆత్మాహుతి బాంబర్లుగా మారుతారని ప్రకటించడం.. తద్వారా హింసకు తావిచ్చేలా వ్యవహరించడం వంటివి ఎన్నికల కోడ్‌కు పూర్తిగా విరుద్ధమని అంటున్నారు పరిశీలకులు.