ఈటలకు ఏనుగు దెబ్బ!
బీఆర్ఎస్ నుంచి ఈటల బయటకు వచ్చినప్పుడు ఆయన వెంట ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు
తెలంగాణ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ఎదురు దెబ్బ. ఆయన రాజకీయ సహచరుడు, అన్ని వేళలా వెనుకే నిలబడే మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి బీజేపీ వదిలి కాంగ్రెస్ గూటికి చేరడమే అందుకు కారణం. ఈటలకు ఎంతో దగ్గర మనిషి అయిన ఏనుగు రవీందర్ రెడ్డి ఇప్పుడు బీజేపీ వీడడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో సొంత మనిషినే పార్టీ మారకుండా ఆపలేకపోయారు.. ఇక బీజేపీలోకి చేరికలను ఎలా ప్రోత్సహిస్తారని ఈటలపై విమర్శలు వచ్చే అవకాశముందని టాక్.
బీఆర్ఎస్ నుంచి ఈటల బయటకు వచ్చినప్పుడు ఆయన వెంట ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈటలతో పాటు బీఆర్ఎస్ పార్టీని రవీందర్ రెడ్డి వదిలేశారు. ఈటలతో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని ఒకప్పుడు ఏలిని ఏనుగు రవీందర్ రెడ్డికి ప్రస్తుత పరిస్థితులు సవాలుగా మారాయి. ఉప ఎన్నికతో కలిపి ఈ నియోజకవర్గంలో ఏనుగు రవీందర్ రెడ్డి మొత్తం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఏర్పడ్డాక కూడా 2014లో అప్పటి టీఆర్ఎస్ తరపున విజయ ఢంకా మోగించారు. కానీ 2018 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి జాజాల సురేందర్ చేతిలో ఓడిపోయారు. అనంతరం సురేందర్ బీఆర్ఎస్ లో చేరడంతో రవీందర్ రెడ్డి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.
ఈ నేపథ్యంలో 2021లో ఈటల రాజేందర్ తో కలిసి ఏనుగు రవీందర్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ సారి ఎన్నికల్లో ఆయన బీజేపీ తరపున పోటీ చేయడం ఖాయమనిపించింది. కానీ ఎల్లారెడ్డిలో బీజేపీకి పెద్దగా ఓటు బ్యాంకు లేదని, పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమని రవీందర్ రెడ్డి భావించినట్లు తెలిసింది. అందుకే కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు మొదలెట్టినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎల్లారెడ్డి అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టింది. మరోవైపు ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్ టికెట్ ను ఇప్పుడు మధుసూధన్ రావుకు హైకమాండ్ కేటాయించింది. ఈ నేపథ్యంలో పార్టీలో చేరిన ఏనుగు రవీందర్ రెడ్డి బాన్సువాడ టికెట్ కోసం పట్టుబడుతున్నట్లు తెలిసింది.