ఆ దేశ ప్రధాని ఆస్తుల లెక్క తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో జాతీయ అవినీతి వ్యతిరేక కమిషన్ కు ఆమె తన ఆస్తుల వివరాల్ని వెల్లడించారు.

Update: 2025-01-04 09:30 GMT

పేటోంగ్టార్న్ పేరు ఎప్పుడైనా విన్నారా? అంటే.. తలను అడ్డంగా ఊపేస్తారు. థాయ్ లాండ్ కు మహిళా ప్రధానిగా ఇటీవల ఒకరు ఎన్నికయ్యారు తెలుసా? అంటే.. చాలామంది ఔనని తలూపుతారు. ఆమె పేరే పేటోంగ్టార్న్. ఆమె పేరుతో సుపరిచితురాలు కానప్పటికీ.. థాయ్ లాండ్ కు మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళగా వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె మరింత గుర్తుండిపోయే వివరాలు వెలుగు చూశాయి. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో జాతీయ అవినీతి వ్యతిరేక కమిషన్ కు ఆమె తన ఆస్తుల వివరాల్ని వెల్లడించారు.

సంపన్నురాలిగా సుపరిచితురాలైనప్పటికీ.. ఇంత భారీగా ఆస్తులు ఉంటాయన్న విషయం చాలామందికి తెలీదు. కారణం.. ఆమె మొత్తం ఆస్తుల విలువ మన రూపాయిల్లో రూ.3430 కోట్లకు (అప్పుల్ని తీసేసిన తర్వాత తేలిన నికర ఆస్తులు) పైనే కావటం విశేషం. ఆమెకున్న ఆస్తుల్లో ఆసక్తికరం అనిపించే అంశం ఏమంటే..ఆమె వద్ద అత్యంత ఖరీదైన లగ్జరీ వాచ్ లు 75 ఉన్నాయని.. విలువైన డిజైనర్ హ్యాండ్ బ్యాగులు 200 వరకు ఉన్నట్లుగా వెల్లడించారు.

మొత్తం ఆస్తులు 400 మిలియన్ డాలర్లుగా చెప్పాలి. అదే థాయ్ కరెన్సీ (బాత్)లో చెప్పాల్సి వస్తే 13.8 బిలియన్ బాత్ లుగా ఉంది. అందులో 5 బిలియన్ బాత్ ను ఆమె అప్పుగా చూపారు. డిపాజిట్లు.. నగదు రూపంలో ఒక బిలియన్ బాత్ ఉండటం గమనార్హం. ఆమె ఆస్తుల లెక్క చూసిన తర్వాత థాయ్ లాండ్ సంపన్నుల్లో ఒకరిగా చెబుతున్నారు. ఆమెకు థాయ్ లాండ్ లో మాత్రమే కాదు లండన్.. జపాన్ లోనూ ఆస్తులు ఉన్నట్లుగా పేర్కొన్నారు.

నిజానికి ఆమె పుట్టకతోనే సంపన్నురాలు. కారణం.. ఆమె తండ్రి తక్సిన్ షినవత్ర.. ఆ దేశానికి మాజీ ప్రధాని. ఆయన చిన్న కుమార్తెనే పేటోంగ్టార్న్. ఆమె తండ్రి మాంచెస్టర్ సిటీ ఫుట్ బాల్ క్లబ్ కు ఒకప్పటి యజమాని. అప్పట్లో ఆయన ఆస్తుల విలువ 2.1 బిలియన్ డాలర్లుగా చెబుతారు. అప్పట్లో థాయ్ లాండ్ టాప్ 10సంపన్నుల్లో ఒకరు కావటం విశేషం. టెలి కమ్యూనికేషన్ సంస్థ షిన్ కార్పొరేషన్ ద్వారా భారీ ఆస్తులు కూడబెట్టారు. ఆమె తండ్రి 2001లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటికి 2006లో జరిగిన సైనిక తిరుగుబాటుతో పదవిని పోగొట్టుకున్నారు. 2011-14 మధ్యలో తక్సిన్ సోదరి.. పేటోంగ్టార్న్ మేనత్త అయిన యింగ్లక్ షినవత్ర ప్రధానిగా ఉన్నారు. మొత్తంగా చూస్తే.. అవకాశం లభించిన ప్రతిసారీ.. వీరి కుటుంబం చేతిలోనే దేశ పగ్గాలు ఉన్నట్లుగా చెప్పాలి.

Tags:    

Similar News