ఆర్థిక సమస్యల్లో పొరుగు దేశం.. కొవిడ్ శాపమేనా ఇది?
ప్రపంచంలో టాప్ ఆర్థిక వ్యవస్థ ఏదంటే అందరూ అమెరికా అని చెబుతారు
పొరుగున్న పాకిస్థాన్ రూపాయి కూడా అప్పు పుట్టని పరిస్థితుల్లొ ఉంది.. మరో పక్క దేశం శ్రీలంక ఆర్థికంగా కుదేలైంది.. బంగ్లాదేశ్, నేపాల్ వ్యవస్థల గురించి చెప్పాల్సిన పనిలేదు.. వీటి సరసన మరో పెద్ద దేశం చేరింది.. అయితే, అది సాదాసీదా దేశం కాదు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. వస్తు తయారీ రంగంలో పేరుగాంచిన వ్యవస్థ.. అలాంటి దేశాన్ని ‘కొవిడ్ శాపం’ వెంటాడింది.
ప్రపంచంలో టాప్ ఆర్థిక వ్యవస్థ ఏదంటే అందరూ అమెరికా అని చెబుతారు. దానిని సవాలు చేస్తూ వస్తోంది కొన్నాళ్లుగా చైనా. ప్రతి రంగంలోనూ కాలుపెడుతూ, విదేశాల్లో వేలు పెడుతూ ముందుకు దూసుకెళ్తోంది డ్రాగన్. చూస్తుండగానే 30 ఏళ్లలో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిపోయింది. రేపో, మాపో అమెరికానూ పడగొడుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. అలాంటి చైనా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎక్కడ ఉంది..?
ఇటీవల డ్రాగన్ ఆర్థికంగా డీలా పడిందట. కొవిడ్ కాలం అనంతరం సవాళ్లను ఎదుర్కొంటున్నామని చైనాకు చెందిన పలువురు అగ్ర నాయకులు ఇప్పటికే చెప్పారు. వారి మాటలు పక్కనపెడితే చైనాకు జీవిత కాల అధ్యక్షుడిగా ఎన్నికైన షి జిన్ పింగ్ మాటేమిటి? అనే సందేహం కలిగింది. చివరకు ఆయన కూడా నోరు విప్పి నిజం చెప్పారు. ఆర్థిక సవాళ్లు నిజమేనంటూ.. కొత్త ఏడాది నాడు బాంబు పేల్చారు. వస్తు ఉత్పత్తికి పేరుగాంచిన చైనాలో.. వాణిజ్య, వ్యాపారాలు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాయని, నిరుద్యోగులు ఉపాధి వేటలో ఇబ్బందులు పడుతున్నారని జిన్ పింగ్ అంగీకరించారు.
పదేళ్లలో తొలిసారి..
చైనాకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక 2013 నుంచి ఏటా జిన్ పింగ్ నూతన సంవత్సర ప్రసంగం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఆర్థిక సవాళ్ల గురించి ఈయన ప్రస్తావించలేదు. ఇప్పుడు మాత్రం నేరుగా అంగీకరించారు. కొన్ని సంస్థలు కష్ట కాలాన్ని ఎదుర్కొంటున్నాయని .. ఉద్యోగాలు లేక, కనీస అవసరాలు తీరక కొంతమంది బాధపడుతున్నారని అన్నారు. వీటి గురించి ఆలోచిస్తున్నానని వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలోకి తెచ్చేలా వేగవంతమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. చైనా అధికారిక మీడియాలో ఈ ప్రసంగం ప్రసారమైంది.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జిన్ పింగ్ ప్రసంగానికి కొన్ని గంటల ముందు చైనా జాతీయ గణాంకాల సంస్థ విడుదల చేసిన.. నెలవారీ పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ (పీఎంఐ) నివేదికలో గత నెలలో ఫ్యాక్టరీ కార్యకలాపాలు ఆరు నెలల కనిష్ఠానికి పడిపోయినట్లు తేలింది. చైనా పీఎంఐ ఇండెక్స్ తగ్గడం వరుసగా ఇది మూడో నెల కావడం గమనార్హం. కాగా, నాలుగేళ్ల కిందట ప్రపంచానికి కొవిడ్ మహమ్మారిని అంటించిన పాపానికి శాపమే ఇది అని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కారణంగా సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాని ప్రభావమే చైనాపై పడుతోంది.