కేసీఆర్‌పై పొగడ్తలు: ప్రకాష్ రాజుకు ఈడీ నోటీసులు.. ఎంత చిత్రమంటే!
తాజాగా ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ప్రకాష్‌రాజ్‌కు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని ఆదేశించారు.
దేశంలో కొన్ని కొన్ని ఘటనలకు కార్యాకారణ సంబంధాలు కూడా ఉండవు. కేవలం రాజకీయం తప్ప! ఇప్పుడు ఇలాంటి పరిణామమే తెరమీదికి వచ్చింది. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల రెండు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బహుభాషా నటుడు.. ప్రకాష్ రాజ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ది సీఎం ఫేస్(ఇమేజ్) కాదు.. పీఎం ఇమేజ్ అన్నారు. అంటే.. ఆయన ప్రధాని కావాల్సిన వారు అని నొక్కి చెప్పారు ప్రకాష్‌రాజ్.
దీనిపై పెద్దగా చర్చేమీ జరగకున్నా.. తాజాగా ఆయన చిత్రమైన కేసులో ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామానికి.. కేసీఆర్ పై ప్రకాష్‌రాజ్ పొగడ్తలకు మాత్రం సంబంధం ఉందని అంటున్నారు పరిశీలకులు.
అసలేం జరిగిందంటే..
తాజాగా ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ప్రకాష్‌రాజ్‌కు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని ఆదేశించారు. అయితే.. ఇదేదో ఆయనకు సంబంధించిన ఆర్తిక నేరమో.. మరేదో అయితే.. పెద్దగా వార్తయ్యేది కాదు. హల్చల్ చేసేది కూడా కాదు. కానీ, ప్రకాష్‌రాజ్‌కు సంబంధం లేని విషయం. ఎలాగంటే.. ఆయన తమిళనాడులోని తిరుచునాపల్లికి చెందిన ప్రణవ్ జ్యుయెలర్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించారు.ఈ అగ్రిమెంట్ కూడా ముగిసిపోయింది.
అయితే, సదరు సంస్థ 'పోంజి స్కీమ్' ద్వారా అధిక లాభాల ఆశ చూపి ప్రజల నుంచి రూ.100 కోట్లు వసూలు చేసింది. అనంతరం ఈ ఏడాది అక్టోబరులో బోర్డు తిప్పేసింది. సంస్త యజమాని దేశం వదిలి వెళ్లిపోయారు. ఈ పరిణామంతో ఆ సంస్థ యజమాని మదన్‌పై తమిళనాడులోని ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. నవంబరులో ఆయనపై లుక్‌అవుట్ నోటీసు కూడా జారీ అయింది.
అయితే.. ఈ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించిన ప్రకాష్‌రాజ్‌కు.. ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ కేసును విచారిస్తున్నాం.. మీరు కూడా రావాల్సిందే! అంటూ.. నోటీసుల్లో పేర్కొంది. నిజానికి ఆయన చేసింది ఏంటి? అంటే.. కేవలం ఆ సంస్థ తరఫున ప్రచారం మాత్రమే. అది కూడా ఈ ఏడాది జనవరితో నే అగ్రిమెంట్ ముగిసింది. పైగా కేసు.. అక్టోబరు నుంచి కొనసాగుతోంది. ఈ 30 రోజుల్లో(కనీసం) ఎందుకు ఆయనను పట్టించుకోలేదు. కేవలం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యల తర్వాతే ఎందుకు నోటీసులు ఇచ్చారనేది ఇప్పుడు ఆసక్తికర ప్రశ్న. ఏదేమైనా.. పైన చెప్పుకొన్నట్టు రాజకీయాల్లో కార్యాకారణ సంబంధాలు ఉండవుమరి!!