దేవేంద్రుడికే సీఎం సీటు...షిండే...పవర్ డిప్యూటీలు
ఉందిలే మంచికాలం అని మిత్రులకు నచ్చచెప్పడంతో శివసేన చీఫ్ అయిన ఏక్ నాధ్ షిండే ఒకింత వెనక్కి తగ్గారు అని అంటున్నారు.
మొత్తానికి మహారాష్ట్ర రాజకీయం ఒక కొలిక్కి వచ్చినట్లుగా కనిపిస్తోంది. బీజేపీ కేంద్ర నాయకత్వం మహారాష్ట్రకు చెందిన ముగ్గురు కీలక నాయకులతోనూ సర్దుబాటు అయితే చేసినట్లుగా ఉంది. ఉందిలే మంచికాలం అని మిత్రులకు నచ్చచెప్పడంతో శివసేన చీఫ్ అయిన ఏక్ నాధ్ షిండే ఒకింత వెనక్కి తగ్గారు అని అంటున్నారు.
అదే టైంలో ఆయన నిన్నటిదాకా తాను సీఎం పోస్టుకే తప్ప డిప్యూటీ సీఎం కాను అని చెప్పినట్లుగా వచ్చిన వార్తలు ఇపుడు వేరేగా మారాయని అంటున్నారు. బీజేపీ పెద్దలు మోడీ అమిత్ షాలు చెప్పిన మేరకు తాను నడచుకుంటాను అని ఆయన చెప్పారు. దాంతో బీజేపీకి మహారాష్ట్ర సీఎం సీటు దక్కబోతోంది.
అంతే కాదు ఏక్ నాధ్ షిండేకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తున్నారని ఆయన అంగీకరించారు అంటున్నారు. నిజానికి ఆయన కాదు అని అంటే వేరేగా ఉంటే అది వేరే సంకేతాలకు తావు ఇస్తుందని బీజేపీ పెద్దలు పట్టుబట్టి మరీ ఆయనను ఒప్పించారు అని అంటున్నారు.
ఇక మరో కీలక మిత్రుడు ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ కూడా మరోసారి ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయన జీవిత కాలంలో అనేక సార్లు ఉప ముఖ్యమంత్రిగానే పనిచేశారు. ఇపుడు అదే సీటు ఆయనకు లభిస్తోంది. ఏక్ నాథ్ షిండే కంటే ముందే ఆయన బీజేపీకి మద్దతుగా నిలిచారు. నిజానికి అక్కడే షిండే పంతం నెరవేరలేదు. ఏక్ నాధ్ షిండే డిమాండ్ కూడా నెగ్గలేదు.
ఏక్ నాధ్ షిండే సీఎం సీటు కోసం చూసిన వేళ అజిత్ పవార్ చకచకా పావులు కదిపి బీజేపీ అధినాయకత్వానికి దగ్గర అయిపోయారు. దాంతో ఇక షిండే అలిగినా ఆగ్రహించినా లాభం లేకుండా పోయింది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే మహారాష్ట్రలో బీజేపీ అజిత్ పవార్ కలిస్తే చాలు బలమైన ప్రభుత్వం ఏర్పడుతుంది. అపుడు షిండే అవసరమే ఉండదు
పైగా అధికారానికి దూరంగా షిండే ఉంటే కనుక ఆయన వెంట ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో కూడా తెలియని విషయం అని అంటున్నారు. ఉద్ధవ్ ఠాక్రే శివసేనను చీల్చి బీజేపీతో జట్టు కట్టిన ఏక్ నాధ్ షిండే ఇదే రకమైన రాజకీయం కొనసాగించాలీ అన్నా శివసేనను అలా తన వెంటే ఉంచుకోవాలీ అన్నా బీజేపీతో జట్టు కట్టడం కంటే వేరే మార్గం కూడా లేదని అంటున్నారు. ఈ విధంగా చూస్తే షిండే మొత్తం పరిణామాలు ఊహించుకుని మరీ బీజేపీ ప్రతిపాదనలకు ఓకే చెప్పారని టాక్ నడుస్తోంది
ఇక మహారాష్ట్ర కేబినెట్ లో మొత్తం 40 మంత్రి పదవులు ఉంటే అందులో బీజేపీ సగం పదవులు తీసుకుంటుందని మిగిలిన సగంలో షిండే పార్టీకి పవార్ పార్టీకి పంచుతుంది అని అంటున్నారు. ఇక కీలకమైన పోర్టు ఫోలియోలను తీసుకోవడం ద్వారా తాము వీలైనంతవరకూ బలపడాలని శివసేన చీఫ్ షిండే, అలాగే ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ చూస్తున్నారు.
ఏక్ నాధ్ షిండేకు అర్బన్ డెవలప్మెంట్ శాఖ, అజిత్ పవార్ కి ఆర్ధిక శాఖ దక్కబోతోంది అన్నది కూడా ప్రచారంలో ఉంది. మొత్తానికి బీజేపీకి చెందిన నేత దేవేందర్ ఫడ్నవీస్ కొత్త సీఎం కాబోతున్నారు. ఆయనకు చెరొక వైపు షిండే పవార్ ఉంటారు. నవంబర్ 30న కానీ డిసెంబర్ 1న కానీ కొత్త మంత్రివర్గం ప్రమాణం చేస్తుంది అన్నది టాక్.