కేసీయార్ కు కమీషన్ బ్రేక్ ?

ఎన్నికల సమయంలో కేసీయార్ ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయానికి కేంద్ర ఎన్నికల కమీషన్ బ్రేకులు వేసింది.

Update: 2023-11-10 11:30 GMT

ఎన్నికల సమయంలో కేసీయార్ ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయానికి కేంద్ర ఎన్నికల కమీషన్ బ్రేకులు వేసింది. ఇప్పటికే రైతు రుణమాఫీ అంశం కమీషన్ దగ్గర పెండింగులో ఉన్న విషయం తెలిసిందే. ఇపుడు రెండో అంశానికి కూడా కమీషన్ బ్రేకులు వేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే ఉద్యోగులకు డీఏలు విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలంటు ప్రభుత్వం ఎలక్షన్ కమీషన్ కు లేఖ రాసింది. అయితే అందుకు కమీషన్ అనుమతి ఇవ్వలేదు.

ఇదే విషయమై ఉద్యోగుల సంఘాల నేతల నుండి కమీషన్ కు అనుమతి కోరుతు వరుసగా లేఖలు అందుతున్నాయి. అయితే ఈ లేఖలన్నింటినీ ప్రభుత్వం లేదా బీఆర్ఎస్ పార్టీయే రాయిస్తోందనే అనుమాన్ని కమీషన్ వ్యక్తంచేస్తోంది. అందుకనే డీఏ విడుదలకు ఇపుడే సమయం దొరికిందా అని ప్రభుత్వాన్ని ఎదురు ప్రశ్నించింది. దానికి ప్రభుత్వం నుండి ఎలాంటి సమాధానం లేదు. ఉద్యోగులకు ప్రభుత్వం మూడు డీఏలు బాకీ ఉంది. ఈ మూడు డీఏలు ప్రభుత్వం 2022లోనే ఇవ్వాల్సుంది.

అయితే ఆర్ధిక సమస్యల కారణంగా ప్రభుత్వం మూడు డీఏలను పెండింగులో పెట్టేసింది. ఉద్యోగులు డీఏల కోసం ఎన్నిసార్లు అడిగినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాంటిది ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత సడెన్ గా ఉద్యోగులకు డీఏలు ఇవ్వాలన్న విషయం ప్రభుత్వానికి గుర్తుకొచ్చింది. అందుకనే ఆగమేఘాల మీద అనుమతులు కోరుతు లేఖలు రాసింది. ఆ అనుమతి లేఖనే కమీషన్ తిరస్కరించింది. ప్రభుత్వానికి ఉద్యోగులపై నిజంగానే చిత్తశుద్ది ఉంటే డీఏలు ఎప్పుడో ఇచ్చుండేదే అనటంలో సందేహంలేదు.

ఎన్నికల్లో ఉద్యోగులు ప్రభుత్వంపై ఎక్కడ కోపంతో వ్యతిరేకంగా ఓట్లేస్తారో అన్న భయంతోనే సడెన్ గా మూడు డీఏలంటు డ్రామా మొదలుపెట్టింది. డీఏలను ఇవ్వాలని ప్రభుత్వం అనుకున్నా కమీషన్ అడ్డుకున్నదనే భావన ఉద్యోగుల్లో కలిగించటమే ప్రభుత్వ ఉద్దేశ్యం. రైతు రుణమాఫీ విషయంలో కూడా కేసీయార్ ప్రభుత్వం ఇలాంటి డ్రామానే చేసింది. ఇన్ని సంవత్సరాలు రుణమాఫీ చేయకుండా కొద్దినెలల ముందునుండి మాత్రమే హడావుడి మొదలుపెట్టిన విషయం చూసిందే. దీన్ని కూడా కమీషన్ అడ్డుకున్నది.

Tags:    

Similar News