నాలుగున్నర వేల కోట్ల సొత్తు సీజ్... ఈసీ కీలక విషయాలు వెల్లడి!
అవును... ఎన్నికల సమయంలో భారీ ఎత్తున ధన ప్రవాహం ఉంటుందనే విషయం తెలిసిందే
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ధనప్రవాహం తీవ్రంగా పెరిగిపోయిందని.. గతంలో ఈ స్థాయిలో ఏనాడూ ఇంత భారీ మొత్తంలో సొత్తు సీజ్ చేయబడలేదని అంటున్నారట ఈసీ అధికారులు. దీన్ని బట్టి ఈసారి ఎన్నికలు ఏ స్థాయిలో రసవత్తరంగా జరగబోతున్నాయనేది అంచనాకు రావొచ్చని అంటున్నారు పరిశీలకులు. ఈ సందర్భంగా ఈసీ కీలక విషయాలు వెల్లడించింది.
అవును... ఎన్నికల సమయంలో భారీ ఎత్తున ధన ప్రవాహం ఉంటుందనే విషయం తెలిసిందే! ఈ సమయంలో... ఓటర్లను ప్రలోభాలకు గురికాకుండా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చర్యలూ తీసుకుంటుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంలో మార్చి ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకూ తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న సొమ్మును ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
ఇందులో భాగంగా... మార్చి ఒకటి నుంచి ప్రతీ రోజూ సగటున రూ.100 కోట్ల విలువైన నగదు, బంగారం, ఇతర తాయిలాలను అధికారులు సీజ్ చేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇలా దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.4650 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ వెల్లడించింది.
ఇదే క్రమంలో... గత ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న సొత్తుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని తెలిపింది. అంతేకాకుండా... లోక్ సభ ఎన్నికల చరిత్రలోనే ఈ స్థాయిలో ఎన్నడూ నగదు, ఇతర తాయిలాలను సీజ్ చేయలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని చెప్పింది.
ఇక ఇప్పటివరకూ స్వాధీనం చేసుకున్న రూ.4650 కోట్ల విలువైన సొత్తులోనూ... రూ.2068 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.489 కోట్ల మద్యం, రూ.562 కోట్ల బంగారం, రూ.1142 కోట్ల వెండి తాయిలాలు ఉన్నాయని తెలిపింది!